అన్నవరం గుడిలో కరోనా పంజా..దర్శనాలు..వ్రతాలు రద్దు

తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో రత్నగిరిపై వెలసిన శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానానికి చెందిన 29 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో తీవ్ర కలకలం రేగింది. ఏపీలో ప్రముఖ దేవాలయాల్లో కరోనా కలకలం రేపటం షాక్‌కు గురిచేస్తోంది. దేవస్థానంలో ఆదివారం వరకూ 10 మంది అర్చకులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోసారి 300 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా వీరిలో భక్తులతో వ్రతాలు చేయించే పురోహితులు 10మంది ఉన్నారు.
దీంతో అప్రమత్తమైన ఆలయ అధికారులు ఆగస్టు 14 వరకు దర్శనాలు..వ్రతాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై ఆలయ ఈవో త్రినాథరావు మాట్లాడుతూ.. స్వామివారికి ఏకాంతంగా నిత్యసేవలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే భద్రాద్రి రామయ్య అర్చకుడికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అంతకుముందు తిరుపతి, విజయవాడ, శ్రీశైలం ఆలయాల్లోని అర్చకులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
కాగా..ఏపీలో కరోనా వీర విహారం చేస్తోంది. దేశంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో ఏపీకి కూడా చేరిపోయింది. గడిచిన 24 గంటల్లో 62,123 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షలు 24,24,393కు చేరాయి. పరీక్షల్లో కొత్తగా 10,080 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,17,040కు పెరిగింది. ఈ క్రమంలో గత 24 గంటల్లో 97మందిని కరోనా కబళించేసింది. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 1,939కి చేరింది. మరోవైపు కరోనా నుంచి కోలుకుని 9,151 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 85,486 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.