బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రచండ తపాను అంపన్.. అత్యంత తీవ్ర తుపానుగా మారింది. 2020, మే 20వ తేదీ బుధవారం అతితీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఒడిశాలోని పారదీప్‌కు దక్షిణంగా వెయ్యి కిలోమీటర్లు, పశ్చిమ్ బెంగాల్‌లోని దిఘాకు నైరుతిగా 1 వేయి 160 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని ఖేరపుపురాకు వాయువ్యంగా 1 వేయి 220 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మంగళవారం వేకువజామున ఉత్తర దిశగా ప్రయాణించిన తర్వాత వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించనుంది. అనంతరం.. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్యలో అంపన్ మే 20 సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయనీ.. రాష్ట్రంలో మాత్రం మోస్తరు వర్షాలకు మాత్రమే అవకాశం ఉందని వివరించారు.
కోస్తా, రాయలసీమ, యానాంలపై అంపన్ ప్రభావం పడనుంది. అక్కడక్కడా గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయనీ విశాఖపట్నం సైక్లోన్ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది. అత్యంత తీవ్ర తుపాన్ నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సెక్షన్ సిగ్నల్ నంబర్ 5ని జారీ చేశారు. కళింగపట్నం, భీమిలి, వాడరేవు పోర్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు అందించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో చింతపల్లి, యర్రగొండపాలెంలో 4 సెంమీ, అచ్చెంపేట, తాడేపల్లిగూడెం, సత్తెనపల్లిలో 2 సెంమీ వర్షపాతం నమోదైంది.
అంపన్ పెను తుపాను వల్ల విశాఖ తీరానికి దీనివల్ల ముప్పేమీ లేదని.. కానీ ఎండలు పెరుగుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సుమారు 2, 3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అంచనాల ప్రకారం.. మంగళవారం ఈ తుపాను ఉత్తరాంధ్ర తీరానికి కాస్త దగ్గరగా వచ్చి తిరిగి దిశ మార్చుకుని పశ్చిమబంగా వైపునకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. తీరానికి కాస్త దగ్గరగా వచ్చేటప్పుడు మాత్రం విశాఖ జిల్లాలో పలు ప్రాంతాలు మేఘావృతమై ఉంటాయి. అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ తర్వాత తీరం నుంచి ఈ తుపాను దూరంగా వెళ్లే కొద్దీ జిల్లాలో మేఘాలు లేకుండా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది.
ఇప్పటిదాకా ఈ తుపాను పశ్చిమబంగా, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటొచ్చనే అంచనా ఉంది. తీరం దాటాక 3, 4 రోజుల వరకు పొడి వాతావరణం అలాగే ఉండే అవకాశం కనిపిస్తోంది. కోస్తా తీరం నుంచి దూరంగా వెళ్లేటప్పటి నుంచి ఆ తుపాను పూర్తిగా బలహీన పడే వరకు.. అంటే సుమారు 7 రోజుల వరకు జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు 34 డిగ్రీలు, 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తుపాను సమయంలో మరో 2, 3 డిగ్రీలు అదనంగా నమోదు కావచ్చని అంచనాలు వేస్తున్నారు. తాజా పరిస్థితులు ఏమిటనేది తుపాను గమనాన్ని బట్టి ప్రకటించే అవకాశాలున్నాయి. గాలిలో ఉన్న తేమంతా తుపాను వైపుగా వెళ్లడంతో ఎండలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
మరోవైపు బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ఆదివారం ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వచ్చాయి. రాగల 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Read: అంపన్ తుపాన్ : పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై ప్రభావం