రియాక్టర్ పేలుడు ఘటనలో 18కి చేరిన మరణాలు.. అచ్యుతాపురంకి సీఎం చంద్రబాబు..
అవసరమైతే గాయపడిన వారిని విశాఖ లేదా హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Atchutapuram SEZ Accident : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 41 మంది గాయపడ్డారు. వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రియాక్టర్ పేలడంతో భవనం స్లాబ్ కూలింది. దీంతో మృతదేహాలు చెల్లా చెదురయ్యాయి.
ప్రమాదం జరిగిన బ్లాక్ మొత్తాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పరిశీలిస్తున్నాయి. ప్రమాద తీవ్రతకు శరీర భాగాలు చిధ్రమయ్యాయి. శిథిలాల తొలగింపు కోసం ఘటనా స్థలానికి బుల్డోజర్లు చేరుకున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. కాగా, అచ్యుతాపురం సెజ్ చరిత్రలో ఇదే అతిపెద్ద దుర్ఘటనగా చెబుతున్నారు.
మరోవైపు ఎసెన్షియా కంపెనీ ముందు ఉద్యోగుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. తమ వారీ ఆచూకీ తెలపాలని వారు కోరుతున్నారు. అటు ఈ ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎం చంద్రబాబు రేపు అచ్యుతాపురం వెళ్లనున్నారు. మృతుల కుటుంబాలతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించనున్నారు.
ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడారు చంద్రబాబు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే గాయపడిన వారిని విశాఖ లేదా హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. కార్మికుల ప్రాణాలను కాపాడుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
అటు మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఇక గాయపడ్డ వారిలో కొందరిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ కు తరలించారు. వారందరికి మెరుగైన వైద్యం అందించేందకు అన్ని ఏర్పాట్లు చేశారు వైద్యులు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మిస్ అయిన ఉద్యోగులు, కార్మికుల కుటుంబసభ్యులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. తమ వారి ఆచూకీ తెలపాలంటూ కన్నీటిపర్యంతం అయ్యారు.
ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు. 50 మందికి గాయాలవగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి వేర్వురు ఆసుపత్రిల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 300 కార్మికులు ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజన విరామం సమయంలో ఈ పేలుడు సంభవించింది. దీంతో ప్రాణభయంతో కొందరు కార్మికులు బయటకు పరుగులు తీశారు. కంపెనీ పరిసరాల్లో పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
Also Read : ఎన్నికలకు ముందు ఓ లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క.. పిఠాపురంపై మెగా హీరోల ఫోకస్, ఏం చేయబోతున్నారంటే..