వరద బాధితులకు పవన్ కల్యాణ్ సాయం.. ఎంత ఇచ్చారంటే..
గత ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించిందని, అందుకే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పవన్ ఆరోపించారు.
Pawan Kalyan Donation : వరద బాధితులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. వరద బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళం ఇవ్వనున్నారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కోటి రూపాయలకు సంబంధించిన చెక్ ను అందజేయనున్నారు పవన్ కల్యాణ్. వరద తీవ్రత, సహాయక చర్యలపై కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు పవన్ కల్యాణ్.
గత ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించిందని, అందుకే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పవన్ ఆరోపించారు. బుడమేరు నిర్వహణ సక్రమంగా లేక వరద పోటెత్తిందన్నారు. మరికొంత వరద వచ్చుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : అందుకే నేను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదు- పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
”నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాపై ఎక్కువ ప్రభావం ఉంది. ప్రభుత్వం వచ్చిన మూడు నెలలే అయ్యింది. ఇంతలోనే ఇలాంటి ఉపద్రవం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవ్వరూ ఊహించని విధంగా తెలంగాణ నుంచి వరద నీరు వచ్చింది. గత ప్రభుత్వం ఏమీ చేయలేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ప్లడ్ కెనాల్స్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తాం. బుడమేరు వాగును గత ప్రభుత్వం విస్మరించింది. అన్నమయ్య ప్రాజెక్ట్ పరిస్థితి చూశాం. చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూడా గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు.
విజయవాడపై ప్రత్యేక కోణంలో దృష్టి పెట్టాలి. ఇది ప్రకృతి విపత్తు. సహాయ పునరావాస కార్యక్రమాల కోసం 262 పంచాయతీ రాజ్ టీమ్ లను ఏర్పాటు జేశాం. చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. లక్ష 72 వేల హెక్టార్లలో పంట దెబ్బతింది. 17,645 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నష్టపోయాయి. 2,851 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. వరద తగ్గుముఖం పట్టింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేపటికి వరద ప్రవాహం 5 లక్షల క్యూసెక్కులకు వచ్చే అవకాశం వుంది. అతి తక్కువ సమయంలో ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోంది. మూడు పార్టీల వ్యక్తులు కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి.