అందుకే నేను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదు- పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించలేదో ఆయనే స్వయంగా చెప్పారు.

అందుకే నేను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదు- పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

Pawan Kalyan : ఓవైపు విజయవాడ ప్రజలు వరదలతో విలవిలలాడిపోతుంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించలేదు, బాధితులను ఎందుకు పరామర్శించలేదంటూ పవన్ కల్యాణ్ తీరుపై తీవ్ర విమర్శలు చేశాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించలేదో ఆయనే స్వయంగా చెప్పారు.

ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే తాను దూరంగా ఉన్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నేను సాయపడాలి కానీ అధికార యంత్రాంగానికి అదనపు భారం కాకూడదు అని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read : 10 నిమిషాల వర్షానికే నదుల్లా కాలనీలు.. బెజవాడ మునిగింది అందుకేనా? ఇక్కడా బుల్డోజర్ దిగాల్సిందేనా?

”నేనూ అక్కడికి వెళ్లి పర్యటించాలని అనుకున్నా. కానీ, నా వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావించి వెళ్లలేదు. నా పర్యటన సాయపడేలా ఉండాలే తప్ప అధికారులపై అదనపు భారం కాకూడదు. నేను రాలేదని కొందరు నిందలు వేస్తారు. అంతే తప్ప ఇంకేమీ ఉండదు. విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవే ముఖ్యం” అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.

”బుడమేరును సరిగా నిర్వహించి ఉంటే వరద తగ్గేది. బుడమేరును గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ప్రస్తుతం వరద తగ్గింది, ముప్పు తప్పింది. అతి తక్కువ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాం. లక్షా 72వేల హెక్టార్లలో పంటనష్టం జరిగింది” అని పవన్ తెలిపారు.

”గజ ఈతగాళ్లు 283 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దాదాపు 3లక్షల ఫుడ్ ప్యాకెట్స్ సప్లయ్ చేశారు. ఏదైనా విపత్తులో ఉన్నా, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా సహాయ సహకారాల కోసం కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 కి కాల్ చేయాలి. 80 కోట్ల రూపాయలను జిల్లాలకు రిలీఫ్ క్యాంపుల కోసం శాంక్షన్ చేశారు. ఈ విపత్తు సమయంలో నిందలు చేయడం కన్నా ప్రజలకు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నదానిపై దృష్టి పెడదాం. భవిష్యత్తులో ఇలాంటివి జరక్కుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము కేబినెట్ లో చర్చిస్తాం. ప్రతి సిటీలో ఫ్లడ్ మేనేజ్ మెంట్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. దానిపై దృష్టి పెడతాం.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని 1వ తేదీనే అనుకున్నా. అయితే మీరు వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని, రిలీఫ్ ఆపరేషన్ కు మీరు అడ్డం అవుతారని అధికారులు సూచించారు. వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. నేను సాయపడాలే కానీ, అదనపు భారం కాకూడదు. అధికారులు 72 గంటల నుంచి నిద్రాహారాలు లేకుండా నలిగిపోతున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని రాలేదు. నేను వెళితే సాయపడాలి కానీ రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బందులు కలగకూడదు. ఫిజికల్ గా నేను కనిపించకపోయి ఉండొచ్చు. కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశాను. రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బంది కలగకూడదు అనే ఒకే ఒక్క సూచన నన్ను అక్కడికి వెళ్లకుండా ఆపేసింది. చెరువుల ఆక్రమణలు చాలా సీరియస్ ఇష్యూ. కచ్చితంగా దాన్ని అడ్రస్ చేయాలి. చెరువులను ఆక్రమించడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలి, వారిని ఎడ్యుకేట్ చేయాలి. నీళ్లు రావడం లేదు కదా అని ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో కూడా నిర్మాణాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఏం జరిగిందో మనం చూశాం. ఇక్కడా అదే జరిగింది” అని పవన్ కల్యాణ్ అన్నారు.