దివ్య తేజస్విని హత్య కేసు, ప్రేమోన్మాది నాగేంద్ర అరెస్టు

  • Published By: madhu ,Published On : November 6, 2020 / 02:06 PM IST
దివ్య తేజస్విని హత్య కేసు, ప్రేమోన్మాది నాగేంద్ర అరెస్టు

Updated On : November 6, 2020 / 2:55 PM IST

Divya Tejaswini murder case : విజయవాడ ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు. అక్టోబర్ 15వ తేదీన దివ్య తేజస్విని దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దివ్య హత్య తర్వాత..నాగేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. 22 రోజుల పాటు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందాడు. 2020, నవంబర్ 06వ తేదీ శుక్రవారం ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ప్రేమోన్మాది నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు.



ఆమెను దారుణంగా చంపింది నాగేంద్రనేనని పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే. పోస్టుమార్టం రిపోర్ట్‌, ఫోరెన్సిక్‌ నివేదికలు ఇవే స్పష్టం చేశాయి. దివ్య ఒంటిపైనున్న కత్తిపోట్లు తనకు తానుగా చేసుకున్నవి కాదని.. నిందితుడు నాగేంద్రనే ఆమె హత్య చేసినట్టు పోలీసులు నిర్థారించారు. పెద్దలు తమ ప్రేమకు అంగీకరించకపోవడంతోనే ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని పోలీసులకు నాగేంద్ర ఇచ్చిన వాంగ్మూలం తప్పని తేల్చారు.



పక్కా స్కెచ్‌ ప్రకారమే దివ్య తేజస్వినిని నాగేంద్ర చంపాడని, పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తోనే మర్డర్‌ చేశాడనే నిజాన్ని ఇటు ఫోరెన్సిక్‌ అటు పోస్ట్‌మార్టం నివేదికలు బయటపెట్టాయి. అంతకుముందు నాగేంద్ర – దివ్య వివాహం చేసుకున్నట్లు ఉన్న ఫొటో మార్ఫింగ్ చేసినట్లు నిర్ధారించారు. ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. దివ్య అంత్యక్రియలు జరిగిన ప్రాంతానికి దిశ స్పెషల్ విభాగం ఆఫీసర్ దీపికా పాటిల్ వెళ్లిన సంగతి తెలిసిందే.



అప్పటి వరకు ఈ కేసును మాచవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దివ్య తేజస్వినికి సంబంధించిన సెల్ఫీ వీడియోలు కలకలం సృష్టించాయి. ఈ క్రమంలో..సీఎం జగన్ ను దివ్య కుటుంబసభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. హోంమంత్రి సుచరితలో కలిసి వారు జగన్ ను కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని దివ్య తల్లిదండ్రులు సీఎంకి వివరించారు. న్యాయం జరిగేలా చూడాలని కోరారు. నిందితుడు నాగేంద్రను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. మరి అరెస్టు చేసిన తర్వాత..నాగేంద్రకు ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి.