వరద బాధిత కుటుంబాలకు ఒక్కొంటికి రూ. 2 వేలు, సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

  • Published By: madhu ,Published On : August 18, 2020 / 12:26 PM IST
వరద బాధిత కుటుంబాలకు ఒక్కొంటికి రూ. 2 వేలు, సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

Updated On : August 18, 2020 / 1:09 PM IST

వరద ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని, మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని, ఖర్చు విషయంలో వెనుకాడ వద్దన్నారు సీఎం జగన్.



2020, ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉభయ గోదావరి జిల్లాలో వరద పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి..కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వరద సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు.

తాను ఏరియల్‌ సర్వేకు వెళ్తున్నట్లు అధికారులు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదన్నారు. అధికారులు ఇస్తున్న క్షేత్రస్థాయి సమాచారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇచ్చే సమాచారం తీసుకోవడంపై ఒక అధికారిని కూడా పెట్టాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో వారు గమనించిన అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు.



మంగళవారం రాత్రికి 17 లక్షల క్యూసెక్కులు, బుధవారం ఉదయానికి 12 లక్షల క్యూసెక్కులు, గురువారం 8 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గుతుందని సమాచారం వస్తోందన్నారు. వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలని, ఎన్యుమరేషన్‌ 10 రోజుల్లోగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సీఎం జగన్ సూచించారు.