Exit poll results
Exit Poll Result 2024: ఆంధ్రప్రదేశ్‌లో గెలుపెవరది..? 20 రోజులుగా దీనికి కచ్చితమైన సమాధానం దొరకడం లేదు. ఎగ్జిట్‌పోల్స్ తర్వాతయినా స్పష్టత వస్తుందనుకుంటే గందరగోళం మరింత పెరిగింది. అసలు గెలుపెవరన్నదానిపై ఓ అంచనా ఉన్నవారిని సైతం సర్వే సంస్థల ఎగ్జిట్‌పోల్స్ సందిగ్ధంలో పడేశాయి. ఎవరికి తోచిన రీతిలో వారిచ్చిన ఫలితాల అంచనాలు కన్ఫూజన్‌ను మరింతగా పెంచాయి. మొత్తంగా ఫలితాల రోజే అసలు నిజం బయటపడుతుందన్న అభిప్రాయంలోకి ప్రజలు వెళ్లిపోయారు.
ఎన్నికల ప్రచారం జరిగే సమయంలో.. భారీ జనసందోహాలను తరలించి నాయకులు బహిరంగ సభలు నిర్వహించేటప్పుడు గెలుపోటములపై అస్పష్టత ఉంటుంది. కానీ పోలింగ్ జరిగేరోజుకు.. ఓటింగ్ ముగిసే సమయానికి ఓ స్పష్టత వచ్చేస్తుంది. ఓడిపోయే పార్టీ ఏదో అధికార పీఠాన్ని అధిష్టించేదెవరో అందరికీ అర్ధమైపోతుంది. కానీ 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ తర్వాత మరింత అస్పష్టత పెరిగింది.
గెలుపు మాదే అని అధికార వైసీపీ అంటే.. కూటమిదే విజయమని టీడీపీ-జనసేన-బీజేపీ ప్రచారం చేసుకున్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ విషయంలోనూ ఇదే కన్‌ఫ్యూజన్ కొనసాగుతోంది. ఓటర్ల ఎగ్జాట్ పల్స్‌ను ఎగ్జిట్ పోల్స్ ప్రతిబింబిస్తాయనుకుంటే.. మరింత కన్ఫ్యూజన్‌లోకి నెట్టివేశాయి. పోలింగ్ జరిగిన 20 రోజుల తర్వాత వెలువడిన ఎగ్జిట్‌పోల్స్ ఈవీఎంలలో పడిన ఓట్లు ఎటువైపున్నాయో తేల్చడంకాకుండా.. తమ రాజకీయ ఉద్దేశాలు, ప్రయోజనాలు, అవసరాలకు తగ్గట్టుగా ప్రజలనాడిని చిత్రీకరించాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరికి తోచిన ప్రచారం వారు..
మే 13న ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. గెలిచేదెవరు.. ఓడేదెవరు.. అనేదానిపై ఎవరికి తోచిన ప్రచారం వారు చేసుకుంటున్నారు. పోలింగ్‌కు, ఫలితాల వెల్లడికి మధ్య సుదీర్ఘ సమయం ఉండడంతో అనేక ఊహాగానాలకు, విపరీత అర్ధాలకు, అసత్యాలకు, అవాస్తవిక అంచనాలకు ఆస్కారం కలిగింది.
ఈ అవకాశాన్ని ప్రధాన పార్టీలు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకునేందుకు ఉపయోగించుకున్నాయి. దీంతో ఎన్నికలకు ముందు ఫలితాలపై ఎలాంటి ఉత్కంఠ ఉందో… అదే పరిస్థితి పోలింగ్ తర్వాతా కొనసాగింది. గెలిచేదెవరో.. ఓడేదెవరో స్పష్టంగా అర్ధంకాని స్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై పోలింగ్ ముగిసే సమయానికి స్పష్టత రావడం సహజ పరిణామం కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పోలింగ్ తర్వాత అస్పష్టత మరింత పెరిగిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది.
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
సాధారణ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికలపైనే ఈసారి ఎక్కువగా చర్చోపచర్చలు సాగడం విశేషం. మొత్తం దేశం.. ఏపీ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండడంతో ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతూపోయింది. 2019లో 151 సీట్ల తిరుగులేని మెజార్టీతో వచ్చిన వైసీసీ ఈ ఎన్నికల్లోనూ.. అంత గానీ అంతకుమించీ కానీ ప్రభంజనం కొనసాగిస్తుందా లేక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలతో సరిపెట్టుకుంటుందా.. అన్నదానిపైనే ప్రధానంగా చర్చలు సాగుతున్నాయి.
సీఎం జగన్ సంక్షేమపాలనకు ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందనేంటి..? విశ్వసనీయతవైపు జనం ఎంత మేర మొగ్గుచూపారు అన్నదే ఎన్నికల ఫలితాలను తేల్చనున్నదన్నది విశ్లేషకుల అభిప్రాయం. మీ ఇంట్లో మంచి జరుగతుందని నమ్మితేనే వైసీపీకి ఓటేయమని జగన్ చెప్పిన మాటలే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టించాయని అధికారపార్టీ నేతలు అంటున్నారు.
సీఎం జగన్ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటారా అన్నదే ఏపీ ఎన్నికల్లో ఈ సారి ప్రధానాంశంగా మారింది. పోలింగ్‌కు భారీగా తరలివచ్చిన మహిళలు, వృద్ధులు వేసిన ఓట్లన్నీ వైసీపీకే పడ్డాయని ఆ పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన 151కి మించి స్థానాలు సాధిస్తామని సీఎం జగన్ నమ్మకంతో ఉన్నారు. పోలింగ్ ముందు నుంచీ గెలుపుపై ఉన్న నమ్మకం ఓటింగ్ తర్వాత మరింత పెరిగిందని వైసీపీ శ్రేణులంటున్నాయి.
అనుకూల ఓటా?
పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వ అనుకూల ఓటని అధికారపార్టీ నేతలంతా నమ్మకంతో ఉన్నారు. అదే సమయంలో పోలింగ్ ముగిసిన దగ్గరినుంచి కూటమి నేతలు.. పోలింగ్ సరళిపై చేస్తున్న ప్రచారం ప్రజల్లో కన్ఫ్యూజన్‌ను పెంచింది. చెప్పాలంటే పోలింగ్ రోజు ఫలితాలపై రావాల్సిన స్పష్టత రాకపోగా.. గందరగోళం మరింత పెరిగింది. భారీగా జరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటని టీడీపీ,జనసేన ప్రచారం చేస్తున్నాయి. ఓటర్లు వెల్లువలా తరలివచ్చి వైసీపీకి వ్యతిరేకంగా ఓటువేసి.. కూటమిని గెలిపించబోతున్నారని మద్దతుదారులు చెబుతున్నారు.
Also Read: కూటమికి క్రేజ్ లేదు.. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
ఎన్నికల ఓటింగ్ ముగిసిన దగ్గరినుంచి గెలుపెవరిది…అనేదానిపై చర్చోపచర్చలు సాగుతూనేఉన్నాయి. ఎవరి వాదన వారు వినిపిస్తున్నా..నిజంగా గెలిచేది ఏ పార్టీనో.. ..ఓడేది ఏ పార్టీనో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఫలితాలరోజునే ఈ ఉత్కంఠకు తెరపడుతుందని అందరికీ తెలిసినప్పటికీ…జూన్ 4 కన్నా ఎక్కువగా అందరూ ఆసక్తి పెంచుకుంది ఎగ్జాట్‌పోల్స్ కాని..ఎగ్జిట్ పోల్స్ కోసం. దేశ ప్రజలు ఈ సారి ఒకటో తారీఖు పడే శాలరీ కన్నా ఎక్కువగా ఎగ్జిట్‌పోల్స్ కోసమే ఎదురుచూశారు.
ఇక్కడే విచిత్రం..
అయితే ఇక్కడే విచిత్రం జరిగింది. ఈవీఎంలో పడిన ఏ ఓటు ఎటువైపు ఉందో ఎగ్జిట్‌పోల్స్ తేల్చిచెబుతాయనుకుంటే..చివరకు ఆ ఫలితాలు చూసి ప్రజలు మరింత గందరగోళంలో పడిపోయారు. పోలింగ్ ముగిసిన తర్వాత పెరిగిన అస్పష్టతకు పదిరెట్లు ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా ఫలితాలపై అయోమయం నెలకొనేలా చేశాయి ఎగ్జిట్ పోల్స్.
పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్ల అభిప్రాయాన్నే ఎగ్జిట్‌పోల్స్‌గా భావిస్తారు. తమకు నచ్చిన పార్టీకి ఓటేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు.. తమ అభిప్రాయం స్పష్టంగా చెప్తారని.. అందుకే ఎగ్జిట్‌పోల్స్‌లో ఎక్కువభాగం నిజమవుతాయని భావిస్తారు. కానీ ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై ఈ సారి వెలువడిన ఎగ్జిట్‌పోల్స్ గమనిస్తే.. అసలు ఈ సర్వేలన్నీ నిబంధనలకు అనుగుణంగా, శాస్త్రీయంగానే జరిగాయా అన్న సందేహం కలగకమానదు.
AP CEC Review : ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈఓ వీడియో కాన్ఫరెన్స్
పోలింగ్ కేంద్రంలో నిల్చున్న ఓటరుకు…ఏ సర్వే ఎవరెవరు..ఏఏ అవసరాల కోసం చేస్తున్నారో తెలియదు. తమను అడిగే ప్రశ్నల వెనక ఉద్దేశం అర్ధం కాదు. ఎవరు అడిగినా ఉన్నదున్నట్టుగా…జరిగింది జరిగినట్టుగా చెబుతారు. ఈ ప్రకారం సర్వే సంస్థలన్నీ ఒకే ఫలితాన్ని…అసలు ఫలితాన్ని ప్రతిబింబించాలి. కానీ విచిత్రంగా అనేక సర్వే సంస్థలు…అనేకానేక ఫలితాలను ప్రకటించాయి. దీంతో ఎగ్జిట్‌పోల్స్ తర్వాత ఫలితాలపై 70శాతం స్పష్టత వస్తుందని భావించినవారు వందశాతం గందరగోళంలో పడిపోయిన పరిస్థితి నెలకొంది.