Legislators Injured : ఏపీలో చట్టసభల సభ్యులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో పలువురు ఎమ్మెల్యేలు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటల పోటీల్లో గాయపడిన వారిలో సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఉన్నారు.
క్రికెట్ లో ఫీల్డింగ్ చేస్తూ విజయ్ కుమార్, బొజ్జల సుధీర్ రెడ్డి, రాధాకృష్ణ కింద పడిపోయారు. వారిగా గాయలయ్యాయి. కబడ్డీ ఆడుతూ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గాయపడ్డారు. వారందరికి ప్రాధమిక చికిత్స అందించారు. ఆ తర్వాత విజయ్ కుమార్, బొజ్జల సుధీర్ రెడ్డి, రాధాకృష్ణ, కంచర్ల శ్రీకాంత్ రమేశ్ హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ వారందరికీ వైద్య బృందం చికిత్స అందిస్తోంది.
ఏపీలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు పలువురు ఉత్సాహం చూపించారు. మొత్తం 173 మంది(ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆటల పోటీల ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.
క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, త్రోబాల్, టెన్నికాయిట్, షటిల్, క్యారమ్స్, బ్యాడ్మింటన్, త్రో బాల్, టగ్ ఆఫ్ వార్, పరుగు పందెం, షార్ట్ పుట్ పోటీలు నిర్వహించనున్నారు. మొత్తం 12 విభాగాల్లో ఆటల పోటీలు జరగనున్నాయి. కొందరు రెండు మూడు ఆటల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు.
సీఎం చంద్రబాబు సైతం బ్యాడ్మింటన్ లో పాల్గొనే అవకాశం ఉంది. కాగా, క్రీడా పోటీలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరుగు పందెం, షార్ట్ పుట్, క్యారమ్స్, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టెన్నికాయిట్, త్రో బాల్, టగ్ ఆఫ్ వార్ క్రీడలను నిర్వహించనున్నారు.
Also Read : ఇది ప్రతీకారమే..! నాడు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారు- వైఎస్ షర్మిల
అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో చట్టసభల సభ్యులకు క్రీడా పోటీలు పెట్టారు. ఏపీ లెజిస్ లేచర్ స్పోర్ట్స్ మీట్ 2025 పేరుతో ఆట పోటీలు నిర్వహిస్తున్నారు. చట్టసభల సభ్యులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు స్పీకర్ నేతృత్వంలో ఈ క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు.