అనంత టీడీపీలో ఆ రెండు వర్గాల మధ్య చిచ్చు

స్థానిక సంస్థల ఎన్నికలతో అనంతపురం టీడీపీలో మరోసారి రెండు వర్గాల మధ్య చిచ్చు రేపింది. అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాము సూచించిన వారికే కార్పేటర్ స్థానాలు కేటాయించాలని పట్టుబడుతున్నారు. టీడీపీ అనంతపురం లోక్ సభ ఇన్ ఛార్జి జేసీ పవన్ తాను సూచించిన వారికి కొన్ని కార్పొరేటర్ సీట్లను కేటాయించాలని ఆయన పట్టుబడుతున్నారు.
అయితే ఆ పార్టీ అనంతపురం అర్బన్ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మాత్రం ప్రసక్తేలేదని జిల్లా నాయకత్వానికి తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. అవసరమైతే రాజీనామాకు సైతం తాము సిద్ధమనే సంకేతాలు పంపించారు.
12 కార్పొరేట్ స్థానాలైనా ఇవ్వండి :
గత ఎన్నికల్లో అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే తనకే అధికంగా ఓట్లు వచ్చాయని జేసీ పవన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పార్టీలో పని చేస్తున్న తన వర్గీయులకు కనీసం 12 కార్పొరేటర్ స్థానాలైనా ఇవ్వాలని పవన్ జిల్లా నాయకత్వాన్ని కోరారు.
ఆ సమయంలోనే రెండు వర్గాల మధ్య టికెట్ల గొడవ బహిర్గతమైంది. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు జిల్లా నాయకత్వం ఎదుట ఆ ఇద్దరు నేతలు భీష్మించుకు కూర్చున్నారని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. కలసి వెళ్తే పార్టీకి మేలు జరుగుతుందన్న విషయాన్ని నాయకులు మరచిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
జేసీ, ప్రభాకర్ మధ్య విభేదాలు :
చాలా కాలంగా పార్టీలో జేసీ, ప్రభాకర్ చౌదరి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి ఎన్నికల సమయంలోనూ రెండు వర్గాల మధ్య ఇవే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కానీ, ఎప్పటికప్పుడు అధిష్టానం సర్దిచెప్పడంతో సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. ఆ తర్వాత షరా మామూలుగానే మళ్లీ ఒకరిపై ఒకరు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారని కార్యకర్తలు అంటున్నారు.
పార్టీ పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగవుతున్న తరుణంలో విభేదాలను పక్కన పెట్టి కలసి పని చేస్తే మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలవుతుంది. కానీ, జేసీ పవన్, ప్రభాకర్ చౌదరి కలసి ముందుకు సాగేందుకు సిద్ధపడడం లేదు. ఈ విషయంలో మరోసారి అధిష్టానం కలుగజేసుకొని సీరియస్‌గా వ్యవహరించకపోతే పార్టీ మరింత దిగజారిపోయే ప్రమాదం లేకపోలేదు.
Also Read | ఏపీలో ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు, కోడ్ ఎత్తేయాలని ఆదేశం