అసలేం జరిగింది? : నెల్లూరులో ఒకే కుటుంబంలో ఐదుగురు మిస్సింగ్

Five of same family missing in Nellore district : నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం జీకె పల్లి ఎస్సీ కాలనీలో మిస్టరీ జరిగింది. గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు అదృశ్యం అయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో….పిల్లలకు ఒంట్లో బాగోలేదు, ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ కు చూపించుకు వస్తామని చెప్పి వెళ్లిన వీరు సాయంత్రం అయినా తిరిగి ఇంటికి చేరుకోలేదు.
దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా ? లేక కుటుంబంపై అలిగి వెళ్లిపోయారా ?అనే విషయాలు తేలాల్సి ఉంది. ఆస్పత్రికి వెళ్ళటానికి ఆటోలో ఎక్కి వెళ్లిన వీరు ఆస్పత్రి దాకా చేరుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చూపించుకున్న తర్వాత నుంచి వీరు కనిపించకుండా పోవటం మిస్టరీగా మారింది.
కనిపించకుండా పోయిన వారిలో కొలిపాక సుప్రియ(25) పోలేపాక విజయ(28) దివ్యశ్రీ(7నెలలు) సురేఖ(2) త్రివేణి(3)లు ఉన్నారు. తప్పిపోయిన మహిళలు ఇద్దరూ తోడికోడళ్లు. వీరి వద్ద ఉన్న సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్లటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు వీరి కోసం గాలింపు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన మహిళలు తప్పిపోవటం స్ధానికంగా కలకలం రేపింది.