AP Telangana Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పెట్రోల్, డీజిల్ కొరత.. కారణం అదేనా?
పెట్రోల్, డీజిల్ దొరక్క వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ, మచిలీపట్నం, కర్నూలులో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
AP Telangana Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పెట్రోల్, డీజిల్ కొరత సమస్య వెంటాడుతోంది. పలు ప్రాంతాల్లో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే పలు బంకులు క్లోజ్ అయ్యాయి. దీంతో పెట్రోల్, డీజిల్ దొరక్క వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ, మచిలీపట్నం, కర్నూలులో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఇంధన కొరత వేధిస్తోంది. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఎక్కడ పెట్రోల్, డీజిల్ దొరకదో అనే భయంతో పలు చోట్ల బంకులకు బారులు తీరారు వాహనదారులు. సరఫరా సమస్యతోనే ఇంధన కొరత ఏర్పడిందని బంకుల యజమానులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిపై వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ దొరక్క వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే బంకులు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.
అయితే కొందరు కావాలనే కృతిమ పెట్రోల్ కొరత సృష్టిస్తున్నారని, మరికొందరు బ్లాక్ లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకదేమో అన్న భయంతో కొందరు డబ్బాలు, డ్రమ్ముల్లో తీసుకెళ్తున్నారని బంకులు యజమానులు తెలిపారు.
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇంధన కొరత సమస్య కనిపిస్తోంది. ఏపీలో పెట్రోల్, డీజిల్ దొరకదన్న భయంతో కొందరు రాష్ట్ర సరిహద్దు బంకులకు క్యూ కడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి, మానవపాడు మండలాల్లో ఉన్న పెట్రోల్ బంకుల వద్ద ఉదయం నుంచి రద్దీగా ఉంది. ఏపీ వైపు నుంచి వందలాది లారీలు, కార్లు, ఆటోలు, వ్యవసాయ వాహనాలు బారులు తీరాయి. దీంతో తెలంగాణలోని పెట్రోల్ బంకులు సైతం రద్దీగా మారాయి.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది. అధికారులు కొరత లేదని చెబుతున్నా బంకుల్లో మాత్రం నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. భైంసాలో 5 పెట్రోల్ బంకులు ఉండగా నాలుగు బంకుల్లో ఇంధన కొరత ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్రోల్ బంకు దగ్గర రద్దీ కనిపిస్తోంది.
Also Read: మీ బ్యాంకు ఖాతాలో ఆటో డెబిట్ ఆన్ చేసారా? ఇవి తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు!
