Site icon 10TV Telugu

రీ ఎంట్రీ ఇస్తా.. పెద్దల సభకు వెళ్తానంటున్న గల్లా జయదేవ్!

Jayadev Galla

Jayadev Galla

గల్లా.. ఈ ఇంటి పేరే ఓ బ్రాండ్. పాలిటిక్స్‌లో అయినా..బిజినెస్‌పరంగా అయినా..గల్లా ఫ్యామిలీకి ఓ నేమ్‌ ఫేమ్‌ ఉంది. గల్లా జయదేవ్‌ తండ్రి గల్లా రామచంద్రనాయుడు, జయదేవ్ తల్లి గల్లా అరుణ గతంలో ఎంపీలుగా పనిచేశారు. పలుసార్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన మహిళా నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె పొలిటికల్ రిటైర్‌మెంట్‌ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తనయుడు గల్లా జయదేవ్‌ రెండుసార్లు ఎంపీ అయ్యారు. రెండేళ్ల క్రితం ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు తన పొలిటికల్ రీఎంట్రీపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేసి చర్చకు దారితీశారు.

దేవుడి ఆశీర్వాదం ఉంటే కచ్చితంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచే మళ్లీ తన ప్రయాణం మొదలవుతుందని జయదేవ్ స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే రాజ్యసభకు కూడా వెళ్తానని..పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు నడుస్తున్నట్లు చెబుతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, టీడీపీ పార్టీ ఆశయాలకు, తన వ్యక్తిగత బాధ్యతలకు అనుగుణంగా ఉండాలని చెప్పారు. అంతే కాకుండా తెలుగుదేశం పార్టీతో తన అనుబంధం ప్రత్యేకమైందని..పార్టీ కోసం గతంలో పనిచేసిన విధానాన్ని ప్రజలు మర్చిపోలేరని గుర్తు చేస్తున్నారు.

Also Read: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో టచ్‌లో కమలనాథులు.. ఆ పార్లమెంట్ పరిధిలో ఆపరేషన్ ఆకర్ష్

గతంలో తన వ్యాపారాలకు పూర్తిగా సమయం కేటాయించేందుకు గల్లా జయదేవ్ రాజకీయాలకు దూరమయ్యారు. 2023లో అధికారికంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తి చూపడం చర్చనీయాంశంగా మారింది. గల్లా జయదేవ్ రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచి మొదలైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా ఎన్నికయ్యారు.

ఇప్పటికే ఆ సీట్ల రేసులో నలుగురు నేతల పేర్లు
పార్లమెంట్‌ వేదికగా ఆయన ప్రసంగాలకూ మంచి గుర్తింపు లభించింది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై పార్లమెంట్‌ వేదికగా ఆయన పోరాటం గుర్తుండిపోయేలా సాగింది. అలానే 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ వేవ్‌లో గల్లా ఘన విజయం సాధించారు. 2024 ఎన్నికలకు ముందు పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పారు. కట్‌ చేస్తే నెక్స్ట్ ఆరు నెలల్లోనే కూటమి పవర్‌లోకి వచ్చింది. గల్లా సిట్టింగ్ సీటు గుంటూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకపోయినా గల్లా పాలిటిక్స్‌కు గుడ్‌బై అంటూ ప్రకటన ఇవ్వకపోయినా బాగుండేదన్న చర్చ ఉంది. లేకపోతే ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యేవారని అంటున్నారు.

అయితే పొలిటికల్ రీఎంట్రీపై జయదేవ్‌ చేసిన కామెంట్స్‌తో టీడీపీలోనూ చర్చకు దారి తీశాయి. పైగా రాజ్యసభకు వెళ్తానంటున్నారు గల్లా జయదేవ్. 2026లో ఏపీలో రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఇప్పటికే ఆ సీట్ల రేసులో ముగ్గురు నలుగురు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గల్లా జయదేవ్‌ కూడా త్వరలో ఖాళీ కాబోయే రాజ్యసభ సీట్లను దృష్టిలో పెట్టుకునే పెద్దల సభకు వెళ్తానంటూ ప్రకటించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీతో ఆయనకున్న అనుబంధంతో పాటు..ప్రముఖ బిజినెస్‌మెన్‌ కావడంతో గల్లాను రాజ్యసభకు పంపే అవకాశాలు లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. పొలిటికల్‌ రీఎంట్రీతో టీడీపీలో గల్లా రోల్ ఎలా ఉండబోతుందో.. రాజ్యసభకు వెళ్తారో లేదో చూడాలి మరి.

Exit mobile version