బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో టచ్‌లో కమలనాథులు.. ఆ పార్లమెంట్ పరిధిలో ఆపరేషన్ ఆకర్ష్
దక్షిణ తెలంగాణలో బీజేపీకి కాస్త సానుకూల వాతావరణం ఉన్న పాలమూరులో పట్టు సాధించేందుకు బీజేపీ పెద్ద స్కెచ్చే వేసిందంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే ప్లాన్‌లో ఉందట కాషాయ దళం.

Telangana BJP
పాలమూరు పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. జనరల్ ఎలక్షన్స్‌కు ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ అయ్యింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పొలిటికల్‌గా పట్టు సాధించేందుకు కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టిందట. ఇప్పటికే బీఆర్ఎస్‌లో రెండు వికెట్లు పడగా మరికొంత మంది లైన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అంతగా కలిసి రాకపోయినా..పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫర్ఫామెన్స్ చూపించింది.
మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ విజయం సాధించగా..నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేసిన పోతుగంటి భరత్ కూడా గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఇలా ఉమ్మడి పాలమూరులో బీజేపీకి కాస్త సానుకూల వాతావరణం ఉండటంతో అక్కడి నుంచే ఆపరేషన్ లోటస్‌ను స్టార్ట్ చేసిందట బీజేపీ. అయితే బీఆర్‌ఎస్‌లో ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే స్కెచ్ వేస్తున్నారు కమలం లీడర్లు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని చూస్తోంది. ఉమ్మడి పాలమూరుకు సంబంధించి ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతను మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు అప్పగించారట. పాలమూరులో సీనియర్ నేత కావడం..పార్టీలకు అతీతంగా మంచి సత్సంబంధాలు ఉండటంతో చేరికలపై డీకే అరుణ ఫోకస్ పెట్టారట.
ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్‌పై మొదట ఫోకస్ పెట్టారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. కమలం పార్టీ నేతలతో జరిపిన చర్చలు సక్సెస్ కావడంతో బీజేపీ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 9న రాఖీ పౌర్ణమి మంచి రోజు కావడంతో కాషాయ కండువా కప్పుకోవాలని గువ్వల డిసైడ్ అయ్యారు. ఇక అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కూడా బీజేపీ గూటికి చేరుతున్నారు.
ఈ నేతలతో టచ్‌లో బీజేపీ
ఈ ఇద్దరు నేతల చేరికతో పాలమూరులో ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది కమలం పార్టీ. వీరితో పాటు మరికొంత మంది నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మర్రిజనార్ధన్ రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే జైపాల్ యాదవ్, మర్రి జనార్ధన్‌రెడ్డి మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మహబూబ్‌నగర్ పార్లమెంట్‌పై కూడా బీజేపీ ఫోకస్ పెట్టిందట. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్ కొడంగల్ ఇదే పార్లమెంట్ పరిధిలో ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరులో డీకే అరుణ బీజేపీ ఎంపీగా గెలిచారు. అయితే మహబూబ్‌నగర్ ఎంపీ పరిధిలోనూ..కొందరు బీఆర్ఎస్ నేతలతో కమలనాథులు సంప్రదింపులు స్టార్ట్ చేశారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని మొదటగా తమవైపు తిప్పుకోవాలని అనుకుంటున్నారట.
ఆ తర్వాత మిగతా నియోజకవర్గాలపై కూడా ఫోకస్ పెట్టేలా ప్రణాళికలు రచిస్తోందట కమలం పార్టీ. దక్షిణ తెలంగాణలో బీజేపీకి కాస్త సానుకూల వాతావరణం ఉన్న పాలమూరులో పట్టు సాధించేందుకు బీజేపీ పెద్ద స్కెచ్చే వేసిందంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే ప్లాన్‌లో ఉందట కాషాయ దళం. నడిగడ్డ సెంట్రిక్‌గా కమలనాథులు వేస్తున్న స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.