జగన్ కోటను బద్దలు కొట్టాలని టీడీపీ పట్టు.. అప్పుడు వైనాట్ కుప్పం అన్న వైసీపీ.. ఇప్పుడు వైనాట్ పులివెందుల అంటున్న టీడీపీ
జగన్ సొంత ఇలాకాలో పులివెందులలో పసుపు జెండా ఎగరేసి వైసీపీ కూసాలు కదిలించాలన్నది టీడీపీ పెద్దల ప్లాన్‌గా ఉంది. దాంతో పదునైన వ్యూహాలను అమలు చేస్తున్నారు.

Chandrababu-Jagan
ఒక ఒక ఎన్నిక ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత వచ్చిన ఓ జడ్పీటీసీ ఉప ఎన్నిక సెంట్రిక్‌గా టీడీపీ, వైసీపీ చేస్తున్న రాజకీయం హీటెక్కుతోంది. గత ఎన్నికల్లో చివరకు కడప జిల్లాలో కూడా జగన్, వైసీపీకి కాస్త ఝలక్ ఇచ్చిన కూటమి..ఇప్పుడు జగన్ ఇలాకా పులివెందుల నడిబొడ్డు వేదికగా జరుగుబోతున్న బైపోల్‌ను గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. జడ్పీటీసీ సీటుకు ఎన్నిక అంటే జిల్లా మంత్రి పర్యవేక్షించడమే మహా ఎక్కువ.
అభ్యర్థి ఎవరు అని కూడా ఆరా తీసిన సందర్భాలు ఉండవు. కానీ పులివెందుల జడ్పీటీసీ సీటుకు బైపోల్ కావడంతో..టీడీపీ పసుపు జెండా ఎగరవేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. జగన్ కంచుకోటలో గెలిచి..రాష్ట్రంలో ఉన్న క్యాడర్, లీడర్లకు ఓ సందేశం పంపాలనేది టీడీపీ ప్లాన్‌గా కనిపిస్తోంది. అందుకే పులివెందుల జడ్పీటీసీ సీటును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది టీడీపీ. వైసీపీకి ఈ ఎన్నిక ఇజ్జత్ కా సవాల్‌గా మారింది. గెలిచి తీరకపోతే సొంత నియోజకవర్గంలో సీటును నిలబెట్టుకోలేకపోయారన్న విమర్శను జగన్ ఫేస్ చేయడమే కాదు..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.
దీంతో అటు వైసీపీకి..ఇటు టీడీపీకి పులివెందుల సీటు ఇప్పుడున్న పరిస్థితుల్లో అతిపెద్ద ఎన్నికగా కనిపిస్తోంది. పులివెందుల వైసీపీ జడ్పీటీసీ మహేశ్వర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో బైఎలక్షన్ వచ్చింది. దీంతో వైసీపీ సానుభూతి అస్త్రంతో మహేశ్వర్‌రెడ్డి కొడుకు హేమంత్‌కుమార్‌రెడ్డితో నామినేషన్ వేయించింది. ఇక టీడీపీ అయితే ఏకంగా ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డి బరిలోకి దింపింది. ఈ ఉప ఎన్నికను అటు వైసీపీ, ఇటు టీడీపీ అధిష్టానం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు..పోల్ మేనేజ్‌మెంట్‌తో పాటు ప్రతీదానిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ తరఫున అయితే ఎంపీ అవినాశ్‌రెడ్డే రంగంలోకి దిగారు. ఇక టీడీపీ వైసీపీ కీలక నేతలను లాగే ప్రయత్నం చేస్తోంది.
ఈ క్రమంలో పులివెందుల జడ్పీటీసీ బైపోల్ వేదికగా రాజకీయం రంజుగా మారింది. పైకి ధీమాగా కనిపిస్తున్నా..ఫ్యాన్ పార్టీ మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అసలే టీడీపీ అధికారంలో ఉంది..ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. పైగా వైసీపీ నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలో ఏదైనా తేడా కొడితే పరువు పోతుందని ఆందోళన చెందుతోందట ఫ్యాన్ పార్టీ. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీమంత్రి వివేకానందను ఓడించిన బీటెక్ రవి..ఇప్పుడు తన భార్య లతారెడ్డిని బరిలోకి దింపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయంలో కీలకపాత్ర పోషించిన ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డితో పావులు కదుపుతున్నారట బీటెక్ రవి. ఎమ్మెల్యే ఆది ఎంట్రీతో జడ్పీటీసీ ఉప ఎన్నిక గెలుపుపై కాన్ఫిడెన్స్‌తో ఉన్నారట.
ఇప్పుడు కూటమి కూడా సేమ్ సీన్ రిపీట్
అయితే అధికారంలో ఉన్నప్పుడు వై నాట్ కుప్పం అనే రేంజ్‌లో డైలాగులు పేల్చేవారు వైసీపీ నేతలు. ఇప్పుడు కూటమి కూడా సేమ్ సీన్ రిపీట్ చేస్తోంది. వై నాట్ పులివెందుల అంటూ రిసౌండ్ చేస్తోంది. ప్రచారాలతో హోరెత్తిస్తున్న టీడీపీ..వరుస పెట్టి ఒక్కో వైసీపీ కీలక నేతను సైకిల్ ఎక్కించుకుంటోంది. అయితే టీడీపీ ఎంత ప్రయత్నం చేసినా..ఎంత అధికార దుర్వినియోగం చేసినా పులివెందులలో పాగా అంత ఈజీ కాదంటున్నారు వైసీపీ నేతలు. గతంలో గెలిచిన మెజార్టీ కంటే బంపర్ మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నా..వైసీసీ సానుభూతిపైనే ఆధారపడినట్లు కనిపిస్తోంది.
పులివెందుల జడ్పీటీసీ స్థానంలో 10వేల 6వందల ఓట్లు ఉండగా..గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే కాంగ్రెస్‌తో పాటు పలువురు ఇండిపెండెంట్లు బరిలోకి దిగడంతో ఓట్లు చీలుతాయోమోనని వైసీపీ టెన్షన్ పడుతోందట. మరోవైపు పులివెందులలో వైఎస్ వివేకా హత్య కేసుని మరోమారు జనంలో పెట్టి రాజకీయంగా వైసీపీని దెబ్బకొట్టాలనేది టీడీపీ వ్యూహరచనగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే టీడీపీకి అధికార బలం ఉంది. రాష్ట్రస్థాయి నుంచి పార్టీ పెద్దల అండదండలు ఉన్నాయి.
లక్కీగా చాన్స్ వచ్చింది. జగన్ సొంత ఇలాకాలో పులివెందులలో పసుపు జెండా ఎగరేసి వైసీపీ కూసాలు కదిలించాలన్నది టీడీపీ పెద్దల ప్లాన్‌గా ఉంది. దాంతో పదునైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. వైసీపీ మద్దతుదారులను వెంట ఉండే చిన్న నాయకులకు కూడా తమ వైపునకు తిప్పుకునే పొలిటికల్ గేమ్ అయితే నడుస్తోందంటున్నారు. అయితే ఈ ఎన్నిక టీడీపీ కంటే వైసీపీకే ప్రతిష్టాత్మకం. ఏ మాత్రం తేడా కొట్టినా ఫ్యాన్ పార్టీకి నష్టం తప్పకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది.
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీతో టీడీపీకి లాభమే తప్ప..పోయేదేమి లేదన్న చర్చ జరుగుతోంది. ఓడిపోతే అది తమ సీటు కాదని చెప్పుకోవచ్చు. గెలిస్తే రాజకీయ సంచలనానికి తెర తీయొచ్చు. ఏకంగా జగన్ సొంత కోటానే బద్ధలు కొట్టామని స్టేట్ మొత్తం రీసౌండ్ వచ్చేలా ప్రచారం చేసుకునే వీలుంటుంది. వైసీపీకి అయితే గెలుపు అనివార్యం. ఓడితే మాత్రం అది వైసీపీ అధినాయకత్వానికి ఇబ్బందిగా మారే ఛాన్స్ లేకపోలేదంటున్నారు. ఈ నెల 12న జరిగే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపెవరిది.. అనేది వేచి చూడాలి.