Gannavaram Assembly Constituency: గన్నవరంలో వంశీ బలమెంత.. పట్టాభి దూకుడు టీడీపీకి మైనస్‌గా మారనుందా?

గన్నవరం టీడీపీలో.. వంశీపై పోటీకి కొత్త ముఖాలు తెరమీదికొస్తున్నాయి. అదే జరిగితే.. ఈసారి కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగానే పోరు ఉండబోతుందా? రాబోయే ఎన్నికల్లో.. గన్నవరంలో కనిపించే సీనేంటి?

Gannavaram Assembly Constituency: గన్నవరం పాలిటిక్స్.. గరం మీదున్నాయ్. వల్లభనేని వంశీపై పోటీకి టీడీపీ నేతలు నేనంటే.. నేనని.. పోటీపడుతున్నారు. మరోవైపు.. వైసీపీ పంచన చేరిన వంశీ మాత్రం.. అధికార పార్టీలో వర్గపోరును ఎదుర్కొంటున్నారు. ఆయన వైసీపీ వైపు రావడంతో.. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న యార్లగడ్డ.. భవిష్యత్ కార్యాచరణేంటి? అసలు.. గన్నవరంలో వంశీ బలమెంత? పట్టాభి దూకుడు.. టీడీపీకి మైనస్‌గా మారనుందా? ఇలా.. ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. అయితే.. గన్నవరం టీడీపీలో.. వంశీపై పోటీకి కొత్త ముఖాలు తెరమీదికొస్తున్నాయి. అదే జరిగితే.. ఈసారి కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగానే పోరు ఉండబోతుందా? రాబోయే ఎన్నికల్లో.. గన్నవరంలో కనిపించే సీనేంటి?

వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు, పట్టాభి రామ్ కొమ్మారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కొన్ని హాట్ సీట్లలో.. గన్నవరం ఒకటి. మొత్తం.. కృష్ణా జిల్లాలోనే.. ఇక్కడి రాజకీయాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయ్. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ.. ప్రస్తుతం.. అధికార వైసీపీకి మద్దతుగా ఉన్నారు. దాంతో.. అటు తెలుగుదేశం, ఇటు వైసీపీలో.. సవాళ్లను ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యే వంశీ. గన్నవరంపై ఎలాగైనా పట్టు సాధించాలనే కసితో ఉంది టీడీపీ. దాంతో.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో.. ఇక్కడి రాజకీయాలు ఫుల్ హీటెక్కాయ్. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ.. తర్వాత వైసీపీ పంచన చేరారు. అప్పటికే.. వైసీపీ నుంచి పోటీ చేసిన ఓడిన యార్లగడ్డ వెంకట్రావు.. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. వంశీ టీడీపీ నుంచి వైసీపీకి రావడం.. యార్లగడ్డకు మింగుడుపడటం లేదు. దాంతో.. గన్నవరం వైసీపీలో వంశీ వర్సెస్ యార్లగడ్డ అనేలా సాగుతున్నాయ్ రాజకీయాలు. ఈ పంచాయతీ.. పార్టీ అధినాయకత్వం దగ్గరకు కూడా చేరింది. మరోవైపు.. తెలుగుదేశం కూడా వంశీ దూకుడుకు చెక్ పెట్టాలని.. తెగ ప్రయత్నిస్తోంది.

1955లో గన్నవరం నియోజకవర్గం ఏర్పడింది. పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం లాంటి మహానుభావులు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య.. 3 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత.. కాంగ్రెస్ అభ్యర్థులు 4 సార్లు గెలిచారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత.. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలకు చెక్ పెడుతూ.. టీడీపీ హవా కొనసాగింది. గన్నవరం అంటే.. పసుపు పార్టీకి కంచుకోట అనే ముద్ర పడిపోయింది. 1989లో చివరిసారి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత రెండు సార్లు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 2009 నుంచి గన్నవరంలో వరుసగా 3 సార్లు విజయం సాధించింది టీడీపీ. గన్నవరం పరిధిలో నాలుగు మండలాలున్నాయి. అవి.. ఉంగుటూరు, గన్నవరం, బాపులపాడు. వీటితో పాటు విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలు.. గన్నవరం నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి.

వల్లభనేని వంశీ (Photo: Twitter)

గన్నవరం వైసీపీలో.. ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) వైసీపీ వైపు వచ్చేసిన దగ్గర్నుంచి.. పార్టీలో తరచుగా విభేదాలు, వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. వంశీ అధికారికంగా వైసీపీలో చేరకపోయినా.. ఆయన ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. దాంతో.. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు, పార్టీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు.. వంశీకి సహకరించడం లేదు. అయితే.. అధిష్టానం మాత్రం గన్నవరం బాధ్యతలు వంశీకే అప్పజెప్పింది. రాబోయే ఎన్నికల్లోనూ.. మళ్లీ ఆయన్నే పోటీకి దించాలనే ఆలోచనతో ఉంది. ఇప్పటికే.. నియోజకవర్గంలో నెలకొన్న విబేధాలకు సంబంధించి.. అనేకసార్లు పార్టీ పెద్దలు చర్చించారు. అయినా.. పరిష్కారం దొరకట్లేదు. అవసరమైతే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమంటున్నారు యార్లగడ్డ వెంకట్రావు. ఈ పరిస్థితుల్లో.. ఎన్నికల నాటికి.. గన్నవరం రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

యార్లగడ్డ వెంకట్రావు (Photo: Facebook)

గన్నవరం అంటే.. తెలుగుదేశానికి కంచుకోట. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ తరఫున వరుసగా రెండు సార్లు గెలిచారు. ఇప్పుడు.. వైసీపీ పంచన చేరారు. మొన్నటిదాకా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు టీడీపీ ఇంచార్జ్‌గా ఉండేవారు. ఆయన మరణానంతరం.. పార్లమెంట్ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ కన్వీనర్‌గా.. సీనియర్ నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. కమ్మ సామాజికవర్గం (Kamma Community) ఎక్కువగా ఉండే గన్నవరంలో.. ఇప్పుడు ఆ వర్గం నేతలంతా.. సైలెంట్ అయిపోయారు. రోడ్లపై వచ్చిన పోరాటాలు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఆర్థికంగా బలంగా ఉన్న వంశీని తట్టుకోవడం సాధ్యం కాదని.. తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే.. గత ఎన్నికల్లో వంశీకి ప్రత్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వైపే.. టీడీపీ చూస్తోంది. ఆయన గనక ఓకే అంటే.. గన్నవరంలో టీడీపీకి ఎదురులేదనే భావనలో పసుపు పార్టీ నేతలున్నారు. ఈ విషయంలో.. యార్లగడ్డ ఇంకా ఎటూ తేల్చుకోలేదనే టాక్ వినిపిస్తోంది.

గద్దె రామ్మోహన్‌ (Photo: Twitter)

మరోవైపు.. విజయవాడ ఈస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్‌ (gadde rammohan)ను.. గన్నవరం నుంచి బరిలోకి దించుతారని.. టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇందుకు.. గతంలో ఆయన ఈ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా గెలవడమే కారణంగా కనిపిస్తోంది. పైగా.. ఇక్కడ బలంగా ఉన్న కమ్మ సామాజికవర్గం ఓటర్లు.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రబాబు కుటుంబ వ్యవహారాలపై వంశీ కామెంట్ చేయడం.. కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. ఇప్పటికే.. ఈ వ్యవహారంలో ఆయన సారీ చెప్పినా.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలోనే.. కమ్మ సామాజికవర్గమంతా.. దాదాపుగా వంశీకి వ్యతిరేకంగానే పనిచేస్తుందనే టాక్ వినిపిస్తోంది.

పట్టాభి రామ్ కొమ్మారెడ్డి (Photo: Twitter)

ఈ మధ్యకాలంలో.. వైసీపీ నాయకులు గన్నవరం టీడీపీ ఆఫీసుపై చేసిన దాడి కూడా రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేశాయ్. దాంతో.. స్థానికంగా ఉన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు.. టీడీపీ నేతల పట్టాభి (Pattabhi Ram Kommareddy) పావులు కదుపుతున్నారు. గన్నవరంలో పోటీ చేయబోయేది తానేనని.. సీనియర్ నేతల దగ్గర ప్రస్తావిస్తున్నారు. మరోవైపు.. స్థానిక పారిశ్రామికవేత్త వాసిరెడ్డి మనోజ్ కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే.. అధినేతను కలిసి తన ఆలోచనని తెలియజేశారు. లోకల్ టీడీపీ నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. గన్నవరం టీడీపీ టికెట్ కోసం ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. అధిష్టానం మాత్రం యార్లగడ్డను బరిలో దించితేనే.. గట్టి పోటీ ఉంటుందనే అభిప్రాయంతో ఉంది. ఆయనకు.. ఏదో విధంగా నచ్చజెప్పి.. ఆఖరి నిమిషంలో బరిలో దించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: హీటు రేపుతోన్న గుడివాడ అసెంబ్లీ సీటు.. కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ స్పెషల్ ఫోకస్..

గన్నవరంలో పుచ్చలపల్లి సుందరయ్య (Puchalapalli Sundaraiah) తర్వాత.. వరుసగా రెండు సార్లు గెలిచిన నేత.. వల్లభనేని వంశీనే. నియోజకవర్గంలో ఆయనకు సొంత ఇమేజ్‌‌తో పాటు వైసీపీ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్లస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. పైగా.. ఇప్పటికీ టీడీపీ నుంచి ఎవరు పోటీలో ఉంటారనే దానిపై.. క్లారిటీ లేకపోవడం కూడా వంశీకే మేలు చేస్తాయనే చర్చ జరుగుతోంది. ఎన్నికల నాటికి.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరినా.. గన్నవరంలో పెద్దగా ప్రభావం ఉండదనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. గత ఎన్నికల్లో.. టీడీపీ, జనసేన (Janasena) విడివిడిగా పోటీ చేస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. వెయ్యి లోపు ఓట్లతోనే గెలిచారు.

Also Read: కుప్పంలో చంద్రబాబు విజయ పరంపరకు.. వైసీపీ చెక్ పెడుతుందా.. బాబు కీలక నిర్ణయం ఏంటి?

ఇక.. వైసీపీ నుంచి యార్లగడ్డకు టికెట్ రాకపోతే ఇండిపెండెంట్‌గా గానీ.. టీడీపీ నుంచి గానీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా గన్నవరంలో.. హ్యాట్రిక్ కొట్టాలని ఎమ్మెల్యే వంశీ భావిస్తున్నారు. టీడీపీ కూడా వంశీకి చెక్ పెట్టి.. మళ్లీ పసుపు జెండానే ఎగరేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. దాంతో.. ఈసారి కూడా వైసీపీ-టీడీపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనేది అర్థమవుతోంది. అయితే.. ఈసారి గెలిచేది వంశీనా.. టీడీపీనా.. అన్నదే.. ఆసక్తి రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు