×
Ad

AP New Districts Row: ఏపీలో మళ్లీ జిల్లాల వివాదం.. రాయలసీమలో కొత్త డిమాండ్లు ఏంటి, సర్కార్ ప్లాన్ ఏంటి..

కొత్త జిల్లాల ఏర్పాటు, సర్దుబాటు విషయంలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సానుకూలంగా లేనట్లు టాక్.

AP New Districts Row: ఏపీలో జిల్లాల పునర్విభజన..కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు డైలీ ఎపిసోడ్‌ అయిపోయింది. మూడు కొత్త జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో ఇష్యూ ముగిసిందనుకుంటే..కథ మళ్లీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తోంది. కూటమి సర్కార్ చేసిన మార్పులు, చేర్పులపై కొన్నిచోట్ల పబ్లిక్ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తుంటే.. మరికొన్నిచోట్ల కొత్త అభ్యంతరాలు తెరమీదకు వస్తున్నాయ్. మార్చిన వాటిపైనే కాదు..మార్పులు చేయని చోట కూడా జనం అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటు, సర్దుబాటు విషయంలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సానుకూలంగా లేనట్లు టాక్. తమ ప్రాంతంలో రెవెన్యూ డివిజన్..లేకపోతే కొత్త జిల్లా ఏర్పాటు వంటి డిమాండ్లు ఆందోళనకు దారితీస్తున్నాయి. అయితే కొత్త జిల్లాల డిమాండ్లు, నిరసనల వెనక పలువురు తెలుగు తమ్ముళ్ల మద్దతు ఉందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజల డిమాండ్లకు అనుగుణంగా..అలా అని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకించలేక..జిల్లా సాధన కమిటీలకు ఇండైరెక్ట్‌గా సపోర్ట్‌ చేస్తున్నారట. దీంతో రాయలసీమలో కొత్త జిల్లాల డిమాండ్ ఏపీ ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.

రాయలసీమలో 3 చోట్ల జిల్లాల డిమాండ్‌..

రాయలసీమలో 3 చోట్ల జిల్లాల డిమాండ్‌ ఎక్కువగా ఉంది. పలుచోట్ల మండల పరిధిపైనే ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదంతా లోకల్ ఇష్యూ కావడంతో స్థానిక అవసరాలు, రాజకీయాల దృష్ట్యా కూటమి నేతల మద్దతు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయ్. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న వేళ.. ఆందోళనలకు కూటమి పార్టీల నేతలు మద్దతివ్వక తప్పడం లేదట. మరోవైపు కొత్త జిల్లాల డిమాండ్‌ను ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ముందుండి హోరెత్తిస్తోందట. ముఖ్యంగా రాయలసీమ అన్నమయ్య జిల్లా పరిధిలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలను కలిపి మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేశారు. దాంతో రాజంపేట, కోడూరు, రాయచోటి నియోజకవర్గాలతో మిగిలిన అన్నమయ్య జిల్లా కేంద్రం తమ ప్రాంతంలోనే ఉండాలనే డిమాండ్ అటు రాజంపేటలో, ఇటు ప్రస్తుత జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఊపందుకున్నాయి.

మరోవైపు కొత్తగా ఏర్పాటైన తిరుపతి జిల్లా పరిధిలో చేర్చిన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలను కలిపి గూడూరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపిరి పోసుకుంది. తిరుపతి జిల్లాలో కలిపిన రాపూరు, కలువాయి, సైదాపురం 3 మండలాలను నెల్లూరు జిల్లా పరిధిలోనే ఉంచాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇంకోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో ఆదోని కేంద్రంగా కొత్త జిల్లా కావాలని నిరసనలు జరుగుతున్నాయ్. వీటికి తోడుగా సత్యసాయి జిల్లా కేంద్రాన్ని పుట్టపర్తి నుంచి హిందూపురానికి మార్చాలని, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో చేర్చిన పులిచర్ల మండలాన్ని అటు చిత్తూరు, ఇటు తిరుపతి జిల్లాల్లో ఏదో ఒకదానిలో చేర్చాలని కోరుతున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పరిధిలోని నగరి నియోజకవర్గానికి చెందిన నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చాలని, గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.

ఆందోళనలకు కూటమి నేతల మద్దతు..

కొత్త జిల్లాల కంటే..మండలాల పరిధి విషయంలోనే ఎక్కువగా ఆందోళన కొనసాగుతున్నాయ్. కొన్ని చోట్ల స్థానికంగా ఏర్పాటైన సాధన కమిటీలు, పోరాట కమిటీలు ప్రొటెస్ట్‌లు చేస్తున్నాయి. జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలను అందచేశారు. స్థానిక ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో అధికారంలో ఉన్న కూటమి పార్టీ నేతల మద్దతు కూడా లభిస్తోందట. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆందోళనకు మద్దతివ్వని పరిస్థితి ఏర్పడిందట. సేమ్‌టైమ్ కొందరు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సీన్సియర్‌గా తమ ప్రాంత ప్రజల కోరికను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. దీంతో ఈ నెల 28న మంత్రుల కమిటీతో సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు.

ఆ సందర్భంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన డిమాండ్లను పరిశీలిస్తారని అంటున్నారు. ఇప్పటికే సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని చెప్తున్నారు. ఆ భేటీ సందర్భంగా మంత్రుల కమిటీకి స్పష్టమైన ఆదేశాలు ఇస్తారా, లేక మరోసారి సమగ్రమైన అధ్యయనం చేయాలని నిర్దేశిస్తారా అనే అంశం తేలాల్సి ఉంది. ఏదైనా జిల్లాల పంచాయతీ కూటమి సర్కార్‌కు సవాల్‌గా మారిందనే చెప్పొచ్చు.

Also Read: వారసుడిని మంత్రిని చేయాలని కలలు కంటున్న గంటా..! భీమిలి పాలిటిక్స్‌లో ఏం జరుగుతోందంటే?