వారసుడిని మంత్రిని చేయాలని కలలు కంటున్న గంటా..! భీమిలి పాలిటిక్స్‌లో ఏం జరుగుతోందంటే?
ఇప్పుడు సీన్ మారింది. గంటా కంటే ఎక్కువగా ఆయన కుమారుడు రవితేజనే భీమిలిలో ఎక్కువగా కనిపిస్తున్నారు.
Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao: గంటా శ్రీనివాసరావు. టీడీపీలోనూ, ప్రజారాజ్యంలోనూ, కాంగ్రెస్‌లోనూ..ఎక్కడున్నా కీలక పదవుల్లో కొనసాగారు. రెండు దశాబ్ధాలకుపైగా రాజకీయాల్లో ఉన్న ఆయన ఓటమి ఎరుగని నేతగా పేరు సంపాదించారు. అయితే 2024 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచిన గంటా మళ్లీ మంత్రి కావాలనుకున్నారు. కానీ ఆ ఆశ నెరవేరడం లేదు. గంటాకు మంత్రి పదవి దక్కకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయని చర్చ జరుగుతోంది.
సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా గంటాకు అమాత్య యోగం దక్కలేదని కొందరు చెబుతున్నా, అసలు అధిష్టానమే ఆయన్ను పక్కన పెట్టిందన్న టాక్ ఉంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరించారని ..చంద్రబాబు అరెస్ట్‌పై గంటా రియాక్ట్ కాలేదని ఆయనపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉందట.
టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు గంటా శ్రీనివాసరావు ప్రయత్నాలు చేశారని అప్పట్లో ప్రచారం బాగా జరిగింది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధిష్టానం గంటాను పక్కన పెట్టేసిందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా ఉన్న మంత్రి లోకేశ్ కూడా గంటాను దగ్గరకు రానివ్వడం లేదట. 2014 హయాంలో చంద్రబాబు కాకుండా లోకేశ్ నాయకత్వాన్ని అప్పట్లో గంటా మనస్ఫూర్తిగా స్వాగతించలేకపోగా, ఎడమొహం పెడమొహంగా ఉండేవారట. ఈ పరిస్థితలన్నింటినీ గమనించిన లోకేశ్ ఇప్పుడు గంటాకు మంత్రి పదవి ఇవ్వలేదనే టాక్ నడుస్తోంది.
Also Read: ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌కు రిస్క్.. చంద్రబాబుకు సవాళ్లు?
గతంలో రెండుసార్లు మంత్రి, ఓ సారి ఎంపీగా..విశాఖలో బుగ్గకారులో రయ్ రయ్‌మంటూ తన హవాను నడిపించిన గంటా, ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా పరిమితం కాలేకపోతున్నారట. పోనీ తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ జరిగితే ఛాన్స్ వస్తుందా అంటే అదీ డౌటేనని తెలిసిపోయిందట.
తన సహచరులైన అయ్యన పాత్రుడు స్పీకర్‌గా, ఒకప్పుడు తాను ఎమ్మెల్యే సీటు ఇప్పించిన ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోంమంత్రిగా, గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బుగ్గ కార్లలో తిరుగుతుంటే..తాను మాత్రం ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దీంతో గంటా తన పొలిటికల్ బ్రెయిన్‌కు మళ్లీ ఇప్పుడు పని చెప్పారట. అందుకే ఇక రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి, తన కుమారుడు రవితేజను పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకురావాలని తహతహలాడుతున్నారని గంటా క్లోజ్ సర్కిల్స్ టాక్.
రవితేజను సిల్వర్ స్క్రీన్‌పైనే చూడాలన్న కోరిక ఏమైంది?
నిజానికి తన కుమారుడు రవి తేజను సిల్వర్ స్క్రీన్‌పై చూడాలని గంటా కోరిక. హీరోగా సినీ రంగంలో నిలబెట్టాలని గంటా ప్రయత్నాలు చేశారు. జయదేవ్ పేరిట గతంలో రవితేజ హీరోగా సినిమా తీశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులతో తనకున్న సన్నిహిత సంబంధాలు కలిసి వస్తాయని భావించారట. అయితే ఆ జయదేవ్ మూవీ మొదటి షోతోనే ముగిసిపోవడంతో, ఇక పొలిటికల్ ఫీల్డే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారట. అప్పటి నుంచి గంటాకు తోడుగా అడపాదడపా మాత్రమే రాజకీయాల్లో రవితేజ కనిపించేవారు.
ఇప్పుడు సీన్ మారింది. గంటా కంటే ఎక్కువగా ఆయన కుమారుడు రవితేజనే భీమిలిలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచినా, తల్లికి వందనం నిధులు మంజూరు చేసినా, అన్నదాత సుఖీభవ, ఫ్రీ గ్యాస్, ఉచిత బస్ వంటి పథకాల్ని ప్రారంభించినా సరే రవితేజ యాక్టీవ్‌గా భీమిలి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించిన కీలక అంశాలపై రవితేజనే అధికారులతో మాట్లాడుతున్నారు. ఇటీవల ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవితేజ దగ్గరుండి ప్రచారం చేశారు.
అలాగే భీమిలి టీడీపీ, జనసేన క్యాడర్‌లో తన పట్టు పెంచుకునేందుకు, అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు రవితేజ. ఇదంతా చూస్తున్నవారికి గంటా స్కెచ్ ఏంటో అర్థమైపోయిందట. వచ్చే ఎన్నికల నాటికి తాను ఎంపీగానో మరో పదవికి వెళ్లిపోయి, తన కుమారుడుని లోకేశ్ టీమ్‌లో చేర్పించి మంత్రిని చేయాలనే ఎత్తుగడలో భాగంగానే..భీమిలిలో రవితేజను యాక్టీవ్ చేశారని అంటున్నారు. ఇటు గంటా కుమారుడిగా, అటు మంత్రి నారాయణ అల్లుడిగా కూడా రవితేజకు రాజకీయ బలగం కలిసి రాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి రవితేజను అసెంబ్లీకి పంపి తర్వాత మంత్రిని చేయడం పక్కా అని గంటా అనుచరులు కూడా లెక్కలు వేసుకుంటున్నారట. మరి గంటా శ్రీనివాసరావు స్కెచ్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మరి.
