Gossip Garage : రెడ్ క్రాస్ చైర్మన్‌గా ఉన్న వైసీపీ నేత ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?

రెడ్‌క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల్లో రాజకీయ వివాదాలేంటని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు. మరి ఈ ఆధిపత్య పోరు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి..

Gossip Garage : రెడ్‌క్రాస్ సొసైటీ పొలిటికల్ టర్న్ తీసుకుందా.. స్వచ్ఛంద సంస్థ చుట్టూ టీడీపీ, వైసీపీ మధ్య ఆధిపత్య పోరు సాగుతుందా..? రెడ్ క్రాస్ చైర్మన్‌గా ఉన్న వైసీపీ నేత ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. నెల్లూరు పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది.

రాజకీయం.. ఇందుకలదు. అందులేదు అనే సందేహం వద్దు.. ఎక్కడ వెతికినా.. ఏ రంగంలో చూసినా రాజకీయ వీరవిహారం కనిపిస్తుంది. ఆఖరికి స్వచ్ఛంద సంస్థలు కూడా రాజకీయ వేదికలుగా మారిపోతున్నాయి. ఇప్పుడు నెల్లూరు రెడ్ క్రాస్‌ స్వచ్ఛంద సంస్థలోనూ పాలిటిక్స్ స్వచ్ఛందంగా ఎంటరయ్యాయని తెగ ప్రచారం జరుగుతోంది.

జిల్లాలో ఎందరో పేదలకు భరోసా ఇస్తూ, బాసటగా నిలుస్తున్న రెడ్ క్రాస్..
నెల్లూరు జిల్లాలో ఎన్నో ఏళ్లుగా సేవే మార్గంగా నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ. జిల్లాలో ఎందరో పేదలకు భరోసా ఇస్తూ.. బాసటగా నిలుస్తూ వస్తోంది. ప్రధానంగా జక్కా సుజాతమ్మ క్యాన్సర్ ఆసుపత్రి, బ్లడ్ బ్యాంక్, గాంధీ ఆశ్రమం, మానసిక వికలాంగుల పిల్లల శిక్షణ కేంద్రం, వ్యాక్సినేషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ సెంటర్.. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లా వ్యాప్తంగా 13 ప్రాజెక్టుల్లో సేవలు అందిస్తోంది.

Minister Narayana

స్వచ్ఛంద సంస్థకు రాజకీయ రంగు..
కరోనా సమయంలో రెడ్‌ క్రాస్ సొసైటీ సేవలు మరువలేనివి. ఎందరో అభాగ్యులకు అన్నం పెట్టి ఆకలి తీర్చి అక్కున చేర్చుకుంది. కరోనాతో చనిపోతే సొంత బిడ్డలే దగ్గరకు రాని సమయంలో రెడ్ క్రాస్ సభ్యులే దహన సంస్కారాలు నిర్వహించారు. సభ్యులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా సొసైటీకి వచ్చేసరికి కండువా పక్కన పెట్టాల్సిందే.. అలాంటి స్వచ్ఛంద సంస్థకు ఇప్పుడు రాజకీయ రంగు అంటుకుందనేది గాసిప్‌.. రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన వైసీపీ నేత పర్వతరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి.. వెళ్తూ వెళ్తూ.. మంత్రి నారాయణపై చేసిన తీవ్ర వ్యాఖ్యలతో ఈ చర్చ పీక్స్‌కు చేరింది..

Also Read : తొక్కిసలాట ఘటనపై అనుమానాలు ఉన్నాయి- సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

మంత్రి నారాయణ కుట్ర ఉందంటూ సంచలన కామెంట్..
రెడ్ క్రాస్ మేనేజ్‌మెంట్ కమిటీలో 15 మంది సభ్యులున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ, కృష్ణ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ పర్వత రెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి వరుసగా రెండు సార్లు సొసైటీకి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. చైర్మన్‌గా పదవీకాలం ఇంకా ఏడాదికి పైగా ఉంది. అయితే రెడ్ క్రాస్‌లో సభ్యులుగా ఉన్న వాళ్లు ఏ రాజకీయ పార్టీలో ఉండకూడదనే ఉత్తర్వులు తెచ్చింది ఏపీ సర్కార్. దీంతో రెడ్ క్రాస్ చైర్మన్‌గా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు.

తన రాజీనామా వెనుక మంత్రి నారాయణ కుట్ర ఉందంటూ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. నారాయణ మెడికల్ కాలేజీలో క్యాన్సర్ సెంటర్‌ ఏర్పాటుకు సహకరించలేదనే కారణంతోనే కుట్ర చేశారని ఆరోపించారు పర్వతరెడ్డి.

నారాయణ మెడికల్ కాలేజీలో క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే అంకాలజీ, రేడియోలజీ, సర్జికల్, మెడికల్ ఉంటేనే అది సాధ్యం. ఈ సదుపాయలు నారాయణ ఆస్పత్రిలో లేవు. అందుకే నెల్లూరు క్యాన్సర్ ఆసుపత్రితో MOU కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.

అప్పుడు చైర్మన్‌గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డితో ఆస్పత్రి నిర్వాహకులు సంప్రదింపులు కూడా చేశారట. కానీ ఆయన తన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టేశారనేది లోకల్‌గా వినిపిస్తున్న చర్చ. అందుకే చంద్రశేఖర్ రెడ్డిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని మంత్రి నారాయణ స్కెచ్ వేశారనేది వైసీపీ సైడ్‌ నుంచి వినిపిస్తున్న ఆరోపణ..

ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలపై అదే స్థాయిలో టీడీపీ నేతలు కౌంటర్‌ అటాక్ మొదలుపెట్టారు. దీంతో వైసీపీ – టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇదిలా ఉంటే.. రెడ్‌క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల్లో రాజకీయ వివాదాలేంటని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు. మరి ఈ ఆధిపత్య పోరు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి..

 

Also Read : వైసీపీని వెంటాడుతున్న కొత్త సమస్య..! ఆ నియోజకవర్గం జగన్‌కు తలనొప్పిగా మారిందా..?