పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌కి ఊహించని ఝలక్ ఇచ్చిన వైసీపీ జడ్పీటీసీలు..!

మొత్తానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో.. ముఖ్య నేతలంతా వైసీపీకి రాజీనామాలు చేస్తూ పార్టీ మారుతున్నారు. అలాంటిది జడ్పీ పీఠం కోసం పట్టు సాధించేందుకు నేతలు ప్రయత్నాలు చేయడం హాట్‌ టాపిక్ అవుతోంది.

Gossip Garage West Godavari ZP Chairperson Issue (Photo Credit : Google)

Gossip Garage : అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి అన్నట్లుగా తయారయింది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జిల్లాపరిషత్ చైర్మన్ పీఠం వివాదం. టీడీపీలోకి వైసీపీ సభ్యులు వస్తారనుకుంటే.. సీన్ రివర్స్ అయింది. దీంతో జడ్పీ చైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీకి సవాళ్లు ఎదురువుతున్నాయ్. టీడీపీలో చేరిన ఆమెపై అనర్హత వేటు వేయాలని.. వైసీపీ జడ్పీటీసీలు ఫిర్యాదు చేశారు. అవిశ్వాస తీర్మానానికి సిద్ధం అవుతున్నారు. మరిప్పుడు జిల్లా పరిషత్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు ఎలాంటి పరిష్కారం లభించబోతోంది? అసలేం జరగబోతోంది..?

తమ జడ్పీటీసీలతో ఫిర్యాదు ఇప్పించిన జిల్లా నేతలు..
పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ పీఠం వ్యవహారంలో మొదలైన వివాదం.. రకరకాల మలుపులు తిరుగుతోంది. వైసీపీని వీడి టీడీపీలో చేరిన జడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాద్‌కు.. వైసీపీ జడ్పీటీసీలు ఝలక్ ఇచ్చారు. మొత్తం 48మంది జడ్పీటీసీలు ఉండగా.. 32మంది సంతకాలతో సీఈవోకు ఫిర్యాదు చేశారు వైస్ చైర్మన్ విజయ్ బాబు.

విప్‌ ద్వారా చైర్‌పర్సన్‌గా ఎన్నికైన గంటా పద్మశ్రీ.. దాన్ని ధిక్కరించినందుకు.. ఆమెపై అనర్హత వేటు వేయాలని.. కొత్త చైర్మన్ ఎంపిక జరపాలని వైసీపీ జడ్పీటీసీలు ఫిర్యాదు. దీంతో ఇప్పుడు జడ్పీపీఠంపై సందిగ్ధం నెలకొంది. గంటా పద్మశ్రీతో పాటు.. మరికొందరు టీడీపీలో చేరేందుకు జడ్పీటీసీలు సిద్ధమయ్యారు. ఐతే మెజారిటీ సభ్యులు జాయిన్ కాకపోవడంతో.. జిల్లా వైసీపీ నేతలు తమ జడ్పీటీసీలతో ఈ ఫిర్యాదు ఇప్పించారు. ఇది రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది.

వైసీపీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నానని ఆవేదన..
జడ్పీ చైర్‌పర్సన్ పద్మశ్రీ బలనిరూపణ చేసుకోవాలని వైస్‌ చైర్మన్‌ విజయ్‌బాబుతో పాటు వైసీపీ జడ్పీటీసీలు డిమాండ్‌ చేస్తున్నారు. ఐతే రసవత్తరంగా మారిన జడ్పీ పీఠం వ్యవహారం.. ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగానే రాజకీయంగా దెబ్బతిసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ చైర్‌పర్సన్‌ భర్త ప్రసాద్ విమర్శలు చేస్తున్నారు. వైసీపీ కోసం ఎంతో కష్టపడి ఆస్తులు పోగొట్టుకున్నానని… రేపు మీ పరిస్థితి కూడా అదే అవుతుందని వైసీపీ జడ్పీటీసీలను హెచ్చరిస్తున్నారు. జిల్లా అభివృద్ధికి కట్టుబడే తాను పార్టీ మారినట్లు తెలిపారు. నిబంధనల మేరకు ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగానే ముందుకు సాగుతామని అన్నారు.

మొత్తానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో.. ముఖ్య నేతలంతా వైసీపీకి రాజీనామాలు చేస్తూ పార్టీ మారుతున్నారు. అలాంటిది జడ్పీ పీఠం కోసం పట్టు సాధించేందుకు నేతలు ప్రయత్నాలు చేయడం హాట్‌ టాపిక్ అవుతోంది. మరి జడ్పీ పీఠాన్ని నిలబెట్టుకుంటారా.. లేదంటే జడ్పీటీసీలు కూడా వైసీపీకి ఝలక్ ఇస్తారా.. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వ్యవహారం ఏం జరగబోతోంది.. ఎవరిది అప్పర్‌ హ్యాండ్ అవుతుందన్నది ఆసక్తి రేపుతోంది.

 

Also Read : మనిషి ఇక్కడ, మనసు అక్కడ..! టీడీపీలో కరణం బలరాం చేరిక ఫైనల్ అయినట్లేనా?