మనిషి ఇక్కడ, మనసు అక్కడ..! టీడీపీలో కరణం బలరాం చేరిక ఫైనల్ అయినట్లేనా?

2019 ఎన్నికల్లో వైసీపీ సునామీని కూడా తట్టుకొని.. చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఐతే ఆ తర్వాత వైసీపీ వైసీపీలో చేరారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది.

మనిషి ఇక్కడ, మనసు అక్కడ..! టీడీపీలో కరణం బలరాం చేరిక ఫైనల్ అయినట్లేనా?

Updated On : October 26, 2024 / 1:08 AM IST

Gossip Garage : ప్రకాశం జిల్లా అంటే ఆయన.. ఆయన అంటే ప్రకాశం జిల్లా. రాజకీయ చదరంగంలో హైట్స్‌ చూసిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి ఇప్పుడు పుట్టింటి మీద మనసు లాగుతోందట. మనిషి మాత్రమే అటు వైపు ఉన్నారు కానీ.. మనసంతా ఆ పార్టీ మీదే ఉందట. దీంతో పాతగూడు, పాత స్నేహితులు బెటర్ అనుకుంటున్నారట. కనిపిస్తున్న పరిణామాలు, వినిపిస్తున్న మాటలు.. ఆయన సొంతగూటికి వెళ్లడం ఖాయం అనిపిస్తున్నాయ్. ఇంతకీ ఎవరా నేత.. ఏంటా కథ..

జిల్లా టీడీపీని ఒంటిచేత్తో నడిపించిన సమర్ధుడు..
కరణం బలరాం.. ప్రకాశం జిల్లాకు చెందిన బలమైన రాజకీయ నాయకులలో ఒకరు. జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరు. కాకలు తీరిన రాజకీయ నాయకుడిగా.. చంద్రబాబు సమకాలికుడిగా.. కరణం బలరాంకు పేరుంది. ఐదేళ్ల కిందటి వరకు.. టీడీపీ అంటే కరణం అనే పేరు వినిపించేది. చంద్రబాబు కష్ట కాలంలో ఉన్న సమయంలో జిల్లా టీడీపీని ఒంటిచేత్తో నడిపించిన సమర్ధుడు. 1978లో ఇందిరా కాంగ్రెస్‌ నుంచి అద్దంకి ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కరణం.. 1983లో టీడీపీలో చేరిన అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉంటూ.. తిరుగులేని నేతగా ఎదిగారు. 2019 ఎన్నికల్లో వైసీపీ సునామీని కూడా తట్టుకొని.. చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఐతే ఆ తర్వాత వైసీపీ వైసీపీలో చేరారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది.

సొంత పార్టీ టీడీపీలోకి వెళ్దామని అనుచరుల ఒత్తిడి..
భౌతికంగా వైసీపీలో ఉన్నా.. కరణం బలరాం మనసు మాత్రం టీడీపీలో ఉందనే టాక్‌ వినిపిస్తోంది. కరణం బలరాం కుటుంబానికి వైసీపీలో మంచి ప్రాధాన్యత దక్కింది. ఆమంచి కృష్ణమోహన్‌ను పక్కన పెట్టి మరీ.. 2024లో చీరాల సీటును కరణం బలరాం కుమారుడు వెంకటేష్‌కు ఇచ్చింది వైసీపీ. ఐతే ఈ ఎన్నికల్లో ఆయన ఘోర పరాభవం మూటగట్టుకున్నారు. ఈ ఓటమిని కరణం బలరాంతో పాటు.. ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

వైసీపీలో వద్దు.. సొంత పార్టీ టీడీపీలోకి వెళ్దామని బలరాంపై అనుచరుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నానని.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కానీ, టీడీపీకి కానీ రాజీనామా చేయలేదని.. పరిస్థితుల కారణంగానే వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందని.. మనం ఎప్పటికీ టీడీపీనే అంటూ కరణం బలరాం చేసిన వ్యాఖ్యలు స్థానికంగా కొత్త చర్చకు దారి తీస్తున్నాయ్. ఇక అటు బాపట్ల జిల్లా బాధ్యతలు లేదంటే రీజినల్ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు తీసుకోమమని కరణం వెంకటేష్‌కు జగన్ సూచించినా.. తండ్రితో చర్చించి నిర్ణయం చెప్తానని.. సున్నితంగా తిస్కరించారు. పార్టీ మారే ఆలోచనే దీని వెనక కారణం అనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

కొండయ్యకు చెక్ పెట్టేందుకు కరణం చేర్చుకోవడమే బెటర్..
గుంటూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య మనవడు విష్ణు నిశ్చితార్థంలో సీఎం చంద్రబాబు, బలరాం ప్రత్యేకంగా సమావేశం కావడంతో.. కరణం కుటుంబం టీడీపీలో చేరడం ఖాయమని జిల్లా అంతా ప్రచారం జరుగుతోంది. ఇక అటు చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య వ్యవహారంపై టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉంది. చంద్రబాబుతో విభేదించిన ఆమంచి సోదరులతో కలిసి.. ఎమ్మెల్యే అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్‌.. కొండయ్యను మందలించినా పరిస్థితుల్లో మార్పు లేదట. దీంతో ఆయనకు చెక్ పెట్టేందుకు కరణం బలరాంను పార్టీలో చేర్చుకోవడమే బెటర్ అనే టాక్ నడుస్తోంది. ఐతే కరణం కుటుంబం మళ్లీ టీడీపీలో చేరడం వెనక ఇంకో సవాల్ కూడా ఉంది. అదే మరింత ఆసక్తి రేపుతోంది.

రవికుమార్‌ను కాదని.. కరణం బలరాంను టీడీపీ అధిష్టానం చేర్చుకుంటుందా..
ప్రకాశం జిల్లాలో కరణం, గొట్టిపాటి ఫ్యామిలీల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయ్. ఐతే అద్దంకి నుంచి కరణం బలరాంను.. చీరాల పంపించిన తర్వాత.. గొడవలు సద్దుమణిగినా.. లోలోపల మాత్రం వేడి ఇంకా చల్లారలేదు. వీటన్నింటికితోడు.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌.. టీడీపీకి నమ్మినబంటు. అలాంటిది రవికుమార్‌ను కాదని.. ఆయనతో చర్చించకుండా.. కరణం బలరాంను టీడీపీ అధిష్టానం చేర్చుకుంటుందా.. ఆ అవసరం టీడీపీకి ఉందా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. ఏమైనా ఉన్నది ఒకచోట.. మనసు మాత్రం మరో చోట అన్నట్లు రాజకీయం చేస్తున్న కరణం బలరాం.. సొంతగూడు ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి మరి.

 

Also Read : వైసీపీలోనే కొనసాగుతారా? జంప్ అవుతారా? మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ దారెటు..