GV Reddy Resign : ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా.. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్.. కారణం అదేనా?

భవిష్యత్తులో ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని జీవీ రెడ్డి తేల్చి చెప్పారు.

GV Reddy Resign : ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు సీఎం చంద్రబాబుకి ఆయన లేఖ రాశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్ చేస్తున్నట్లు చంద్రబాబుకు తెలిపారాయన. భవిష్యత్తులో ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని జీవీ రెడ్డి తేల్చి చెప్పారు.

ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఫైబర్ నెట్ ఎండీ, ఐఏఎస్ దినేశ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని జీవీ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో జీవీ రెడ్డిని సీఎం చంద్రబాబు మందలించినట్లు సమాచారం.

Also Read : ఆ భయంతోనే అసెంబ్లీకి వెళ్లారా? సభకు వెళ్లే దమ్ము లేకపోతే రాజీనామా చేయండి- జగన్ పై షర్మిల ఫైర్

తనపై ఉంచిన విశ్వాసానికి, కీలక బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు జీవీ రెడ్డి. తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగా ప్రజాసేవలో ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో పాటు టీడీపీకి, పార్టీ పదవులకు కూడా జీవీ రెడ్డి రిజైన్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

 

కొంతకాలంగా ఫైబర్ నెట్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే జీవీ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఫైబర్ నెట్ లో చోటు చేసుకున్న వ్యవహారాలపై చాలా సీరియస్ గా జీవీ రెడ్డి రియాక్ట్ అయ్యారు. అక్రమ పద్ధతుల్లో ఫైబర్ గ్రిడ్ లో ఉద్యోగాలు పొందిన వారిని గుర్తించి తీసివేయించారు.

ఫైబర్ నెట్ లో పరిణామాల పట్ల కలత చెందిన జీవీ రెడ్డి నేరుగా మీడియాతో మాట్లాడారు. అయితే, దీనిపై సీఎం చంద్రబాబు జీవీ రెడ్డిని మందలించినట్లు సమాచారం. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పాలి కానీ, ఈ విధంగా మీడియాకు ఎక్కడం సరికాదని హితవు పలికినట్లు తెలుస్తోంది.

Also Read : ఇలాగైతే వైసీపీ నేతలు జర్మనీకి వెళ్లిపోవడం బెటర్.. ఎందుకంటే..: పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్

ఫైబర్ నెట్ ను సంస్కరించాలని జీవీ రెడ్డి భావించారు. కానీ, అక్కడ అధికారుల నుంచి తనకు సహకారం లేదని జీవీ రెడ్డి చెబుతున్నారు. గత ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ను ఏ విధంగా నాశనం చేసింది అనేది లెక్కలతో సహా ఆధారాలు కూడా జీవీ రెడ్డి బయట పెట్టిన పరిస్థితి ఉంది. ఆయన ఛైర్మన్ అయిన దగ్గరి నుంచి ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టారు.

ఫైబర్ నెట్ లో ఉన్న అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని జీవీ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఐఏఎస్ అధికారులు తీవ్రంగా స్పందించారు. అటు, చంద్రబాబు సైతం ఆయనకు హితబోధ చేసినట్లు సమాచారం. రాజకీయ భవిష్యత్తు ఉన్న వ్యక్తి ఈ విధంగా దూకుడుగా వెళ్లటం కరెక్ట్ కాదనే విధంగా జీవీ రెడ్డికి చంద్రబాబు హితబోధ చేశారట. అయినప్పటికీ.. జీవీ రెడ్డి కీలక నిర్ణయం తీసేసుకున్నారు.