Ys Sharmila : ఆ భయంతోనే అసెంబ్లీకి వెళ్లారా? సభకు వెళ్లే దమ్ము లేకపోతే రాజీనామా చేయండి- జగన్ పై షర్మిల ఫైర్
ప్రజల శ్రేయస్సు కంటే.. మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు.

Ys Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేశారు. జగన్ ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ అసెంబ్లీలో జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును షర్మిల తప్పుపట్టారు. ఎక్స్ వేదికగా వారిని నిలదీశారు.
జనాలు ఛీ కొడుతున్నా జగన్ తీరు మాత్రం మారలేదని విమర్శించారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది? అని ఆమె నిలదీశారు. ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా? అని జగన్ ను ప్రశ్నించారు. సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం అసెంబ్లీకి వచ్చారా? అని వైసీపీ అధినేతను క్వశ్చన్ చేశారు షర్మిల.
గవర్నర్ గారి ప్రసంగంలో పసలేదు. దిశా-నిర్దేశం అంతకన్నా లేదు. అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలు. సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదు. సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదు. ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్పా మిగతా 5 హామీలపై స్పష్టత…
— YS Sharmila (@realyssharmila) February 24, 2025
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా? అని జగన్ ను అడిగారు. ప్రజల శ్రేయస్సు కంటే.. మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదు అనుకుంటే.. ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే.. మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్ళాలని కోరుతున్నామన్నారు షర్మిల. సభకు వెళ్ళే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు షర్మిల.
Also Read : ఇలాగైతే వైసీపీ నేతలు జర్మనీకి వెళ్లిపోవడం బెటర్.. ఎందుకంటే..: పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్
ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని నినాదాలు చేశారు. ప్రజల సమస్యలపై గళం విప్పేందుకు తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. దాదాపు 11 నిమిషాలు నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు.. ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు.
Also Read : అసెంబ్లీ సమావేశాల వేళ వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఇకపై..
మరోవైపు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేదని, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. కాగా.. అసెంబ్లీకి వెళ్లినా, వెళ్లకున్నా ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని జగన్ అన్నారు. ”నేనింకా 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటాను. నాతో పాటు ఉండే వాళ్లు నా వాళ్లు. 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి” అని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు జగన్.