Heavy Rains
AP and Telangana : ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల జడివాన పడుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు పలు చోట్ల వాగులు, వంకలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు అలుగుపోశాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. నగరాలు, పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీట మునగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్- విజయవాడ హైవేపై అబ్దుల్లాపూర్ మెట్ రోడ్డుపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర యాతనపడ్డారు.
తెలంగాణలోని పాలమూరు, మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. మెదక్ జిల్లాలో తూప్రాన్‌లో అత్యధికంగా 10.8 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 10.4 సెంటీమీటర్లు, కొమురవెల్లి, నారాయణరావు పేట మండలాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా పగలంతా రెండు చోట్ల భారీగా, 29 ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, 193 ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. దీంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా బందనకల్ శివార్లలో రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా జలమయమైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం 8 గంటల కుండపోతకు పెద్ద చెరువు అలుగు పోసింది. దీంతో మహబూబ్‌నగర్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు పోటెత్తింది.
మెదక్‌లోని బృందావన్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో చెరుగు అలుగు పొర్లడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్‌స్టేషన్ జలదిగ్బంధమైంది. వికారాబాద్ జిల్లా ధారూరు వాగులోని చెక్‌డ్యామ్‌ను కొందరు దాటుతుండగా గోరయ్య అనే వ్యక్తి పట్టుతప్పి పడిపోవడంతో ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయాడు.
హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చెరువులన్నీ నిండాయి. నాలాలు పొంగి ప్రవహిస్తుండడంతో వర్షపు, డ్రైనేజీ నీరు రోడ్లను ముంచెత్తింది. మీర్‌పేట పరిధిలోని జిల్లెలగూడ చెరువు దగ్గర వరద నీరు రోడ్డుపైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సరూర్‌నగర్ చెరువును ఆనుకుని ఉన్న కాలనీల్లో రహదారులపై వరద ప్రవాహం కొనసాగింది.
ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కుండపోతకు రహదారులు జలదిగ్బంధమయ్యాయి. రాయలసీమ జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడ్డాయి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో.. అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో ఏకంగా 96.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పాతపట్నంలోని లోతట్టుప్రాంతాల్లోని ఇళ్లను వర్షపు నీరు ముంచెత్తింది. దీంతో రహదారులన్నీ చెరువులను తలపించాయి. విజయనగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో.. రోడ్లు వాగులను తలపించాయి. కనపాక ప్రాంతంలో అత్యధికంగా 14.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇవాళ ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో్ కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రేపు భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని హెచ్చరించింది.