వర్ష బీభత్సం….మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి

  • Publish Date - October 21, 2020 / 07:24 AM IST

Heavy rains next three days  : మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్21, మంగళవారం ఉదయం నాడు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తదుపరి బుధ, గురువారాల్లో ఇది వాయవ్య దిశగా పయనించి.. 3 రోజుల తర్వాత దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో నిన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడ్డాయి.



బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. సముద్రం వెంబడి గంటకు గరిష్టంగా 60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
https://10tv.in/hyderabad-rains-be-alert-two-days/
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అవనిగడ్డ, తణుకు 6 సెం.మీ., అమలాపురం, ఏలూరు, బొబ్బిలి, మంగళగిరి, తునిలో 5సెం.మీ. వర్షపాతం నమోదైంది.



మరో వైపు హైదరాబాద్ ను వర్షం భయం వెంటాడుతోంది.ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం  కూడా వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రెండు గంటలకోసారి మోస్తరు వర్షం పడగా సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆకాశం ముసురుపట్టి జోరువాన కురిసింది. పలు ప్రాంతాల్లో ఐదు సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

మరో మూడు రోజులపాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరిక నగర వాసులను మరింతగా భయపెడుతోంది. బుధవారం తెల్లవారుఝూము  నుంచే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వాన కురుస్తోంది. ఇటీవల కురిసిన వర్ష బీభత్సానికి నీట మునిగిన సుమారు 200 కాలనీలు ఇంకా వరద నీటిలోనే నానుతున్నాయి. వరద తగ్గుముఖం పట్టినా 100పైగా కాల నీలు ఇంకా పూర్తిస్థాయిలో తేరుకోలేదు.



ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సరూర్ ‌నగర్‌లోని లోతట్టు ప్రాంత కాలనీలైన కోదండరాంనగర్, సీసాల బస్తీ, వీవీ నగర్‌ ముంపు బాధితులను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూనే ఉన్నారు. సరూర్‌నగర్‌ చెరువులోకి ఎగువ ప్రాంతాల చెరువుల నుంచి భారీగా వరద వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

భారీ వర్షాలకు తడిసిన పురాతన కట్టడాలు నేలమట్టమవుతున్నాయి. చార్మినార్‌ సర్దార్‌మహల్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయం సమీపంలోని పురాతన ఇంటితోపాటు గౌలిపురా సాయిబాబా దేవాలయం సమీపంలోని మరో పురాతన ఇల్లు, గుడిమల్కాపూర్‌లో ఒక ఇల్లు మంగళవారం తెల్లవారుజామున కూలింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.



ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు వరద నీరు పోటెత్తింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు హిమాయత్‌సాగర్‌ జలాశయం 1,763 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో రెండు గేట్లు ఎత్తి వరదనీటిని మూసీలోకి వదిలిపెట్టారు. ఈ జలాశయంలోకి 1,200 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరినట్లు జలమండలి అధికారులు తెలిపారు.

ఇక పక్కనే ఉన్న ఉస్మాన్‌సాగర్‌ గరిష్ట నీటిమట్టం 1,790 అడుగులుకాగా ప్రస్తుతం 1,786.110 అడుగుల మేర వరదనీరు చేరింది. పరీవాహక ప్రాంతం నుంచి సుమారు 1000 క్యూసెక్కుల మేర వరద వస్తుండడంతో గేట్ల ఎత్తివేతకు జలమండలి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్‌, వికారాబాద్‌లో భారీ వర్షం కురవడంతో వరద ఉధృతి గణనీయంగా ఉండడం, మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో బుధవారం గేట్లు ఎత్తి దిగువ నీటిని వదలనున్నారు.



ఇప్పటికే హిమాయత్‌సాగర్‌ నుంచి నీటిని విడుదల చేస్తుండగా, ఉస్మాన్‌సాగర్‌ గేట్లు ఎత్తివేసే సందర్భం రావడంతో దిగువ మూసీ పరీవాహక ప్రాంతాలను యంత్రాంగం మరింత అప్రమత్తం చేసింది. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న నగర ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉందని మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. షేక్‌పేట డివిజన్‌లోని కొత్త చెరువు కింది భాగంలో ఉన్న గుడిసెల్లో వరద నీటితో ఇబ్బందులు పడుతున్న వారికి తక్షణ సాయంగా రూ.10వేల చొప్పున నగదు అందజేశారు.