Nara Lokesh - Bhimavaram (Photo : Google)
Nara Lokesh – Bhimavaram : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గునుపూడి వంతెన దగ్గర వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. కర్రలతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో పోలీసులకు గాయాలయ్యాయి. వైసీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. రాళ్ల దాడిపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేరులో ఆగి నిరసన తెలిపారు. ఉన్నతాధికారులు వచ్చేవరకూ ముందుకు కదిలేది లేదని లోకేశ్ తేల్చి చెప్పారు.
కాగా, లోకేశ్ కాన్వాయ్ లోని పలు వాహనాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అటు టీడీపీ నేతలు సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసన తెలిపారు. ఇరువర్గాల మధ్య ఘర్షణతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. మంగళవారం భీమవరంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న సీఎం జగన్ ఫ్లెక్సీ పైకి టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీన్ని గుర్తించిన పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. దాంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.