అభిమాని చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ

MLA balakrishna slaps : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య మరోసారి ఆగ్రహోదగ్రులయ్యారు. అభిమాని చెంప చెళ్లుమనిపించారు. వీడియో ఎందుకు తీశావంటూ..ఆగ్రహంతో ఊగిపోయారు. తీసిన వీడియోను వెంటనే డిలీట్ చేయాలని ఆదేశించారు. బాలయ్య ప్రవర్తనతో అక్కడున్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
త్వరలో ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రచారం నిర్వహిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గంలో వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ భావిస్తున్నారు. అందులో భాగంగా గత మూడు రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. నీలకంఠపురంలో 10వ వార్డు టీడీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లారు బాలయ్య.
వారింట్లో జ్యూస్ తాగారు. అనంతరం ఎన్నికల్లో నిర్వహించాల్సిన దానిపై అభ్యర్థి భర్తతో చర్చిస్తున్నారు. అక్కడనే ఉన్న అభ్యర్థి కుమారుడు ఇదంతా వీడియో తీశాడు. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన బాలయ్య…ఎందుకు వీడియో తీశావంటూ..చెంప చెళ్లుమనిపించారు. ఉన్నట్టుండి ఆవేశానికి లోనైన బాలయ్యను చూసిన అక్కడున్న వారు అవాక్కయ్యారు. గతంలోనూ..బాలయ్య తన అభిమానుల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమయ్యాయి.