TDP Strategy: టీడీపీ ముందున్న ఏకైక మార్గం అదేనా.. వారిద్దరినీ ప్రజాక్షేత్రంలోకి తీసుకొస్తారా?

చంద్రబాబు తర్వాత తన వంతు తప్పదని లోకేశ్ దాదాపు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారు. అరెస్ట్ కావటానికి మానసికంగా సిద్ధమవటంతో పాటు అలాంటి పరిస్థితుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబుతో విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది.

how telugu desam party sympathy strategy work out

TDP- YCP Strategy చంద్రబాబునాయుడు అరెస్టుతో (Chandrababu Arrest) విపత్కర పరిస్ధితి ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు.. ఇక సెంటిమెంట్ అస్త్రం (TDP Sentiment Strategy) తప్ప మరో మార్గం లేదన్న నిశ్చయానికి వచ్చారా? చంద్రబాబు తర్వాత లోకేశ్‌ను (Nara Lokesh) అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ అధికారులు పావులు కదుపుతున్నారనే బలమైన అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో తమ ముందున్న ఏకైక మార్గం బ్రాహ్మణి, (Brahmani Nara) భువనేశ్వరిని (Nara Bhuvaneshwari) ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లటమేనా? ఇందుకోసం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు వ్యూహ రచన చేస్తున్నారా?

చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ జనం భారీ స్థాయిలో రోడ్ల మీదకు వస్తారని తెలుగుదేశం నేతలు భావించారు. కారణమేదైనా స్పందన మాత్రం ఆస్థాయిలో రాలేదు. కేసుల భయం వల్లే రోడ్లెక్కటానికి జనం జంకుతున్నారని, అయితే ప్రజల్లో సానుభూతి మాత్రం బాగా కనిపిస్తోందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇది కచ్చితంగా తమకు మేలు చేస్తుందని టీడీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించడానికి తెరవెనుక రంగం సిద్ధం చేస్తున్నారు.

సాధారణ పరిస్ధితుల్లో ఎన్నికలకు వెళ్తున్నప్పుడు.. ఇటు పాలక పక్షానికి, అటు ప్రతిపక్షానికి ఎన్నికల్లో నెగ్గేందుకు తమదైన ప్రణాళిక ఉంటుంది. రకరకాల హామీలు గుప్పించే ఎన్నికల మేనిఫెస్టో ఇందులో ప్రధాన భూమిక పోషిస్తుంది. అయితే అసాధారణ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఇవన్నీ పక్కకు జరిగిపోయి ఓ ప్రత్యేక ఎజెండా ముందుకొస్తుంది. సెంటిమెంట్ అస్త్రం ఈ కోవలోనిదే. ఈ సానుభూతి అస్త్రమే తమకు కలిసివస్తుందని తెలుగుదేశం భావిస్తోంది.

గతంలో జగన్ మోహన్ రెడ్డి ఎన్నో కేసుల్ని ఎదుర్కొని దాదాపు 16 నెలల పాటు జైల్లో ఉండటంతో జనంలో ఎక్కడా లేని సెంటిమెంట్ వచ్చిందని.. జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల (YS Sharmila) తమ పాదయాత్రల ద్వారా ఈ సానుభూతిని ఓట్లుగా మార్చారని అభిప్రాయం సర్వత్రా వినిపిస్తూ ఉంటుంది. తామూ ఇలాంటి అస్త్రాన్నే ప్రయోగించబోతున్నామని బాహాటంగానే చెబుతున్నారు టీడీపీ నేతలు.

చంద్రబాబు తర్వాత తన వంతు తప్పదని లోకేశ్ దాదాపు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారు. అరెస్ట్ కావటానికి మానసికంగా సిద్ధమవటంతో పాటు అలాంటి పరిస్థితుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబుతో విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు తాను వినియోగించిన యువగళం వాహనం మీదే బ్రాహ్మణి, భువనేశ్వరితో రాష్ట్రమంతటా పర్యటించి తమకు జరిగిన అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్లాలన్నదే లోకేశ్, చంద్రబాబు వ్యూహం.

Also Read: షర్మిలకు బిగ్ షాక్..? కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనానికి చెక్..! కారణం అదేనా? షర్మిల ఏం చేయనున్నారు?

ఈ పరిణామాలన్నిటినీ వైసీపీ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. సెంటిమెంట్ ప్రభావాన్ని పూర్తిగా కొట్టివేయలేక పోయినప్పటికీ, పూర్తిగా సెంటిమెంటే గట్టెక్కించలేదనేది వైసీపీ వర్గాల అంచనా. జగన్ ఎదుర్కొన్న పరిస్థితులకీ.. చంద్రబాబు ఎదుర్కొంటున్న పరిస్థితులకీ ఎంతో తేడా ఉందని వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియాను ఢీకొట్టి తనలో ఉన్న ఫైటర్ స్వభావాన్ని జగన్ తెరపైకి తీసుకువచ్చాడని.. దాంతో జగన్‌ను ఓ హీరోలా చూడటం యువతలో ప్రారంభమైందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: లోకేశ్‌ను అరెస్ట్ చేస్తే.. ఆమెను ముందు పెట్టి పార్టీ నడిపిస్తాం- అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

మరోవైపు దాదాపు ప్రతి ఉప ఎన్నికల్లోనూ తన ఆధిపత్యాన్ని నిరూపించటం ద్వారా ఏపీ రాజకీయాల్లో తనదే పైచేయి అని జగన్ పదేపదే నిరూపించుకున్నారని గుర్తు చేస్తున్నాయి వైసీపీ వర్గాలు. వీటన్నిటికి తోడు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పట్ల ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రబలడంతో ఏర్పడిన రాజకీయ శూన్యతతో దిగువ స్థాయి కాంగ్రెస్ నేతలంతా వైసీపీ వైపు మళ్లారని చెబుతున్నారు.

Also Read: ‘రా చూసుకుందాం’ అంటూ బాలకృష్ణకు మంత్రి అంబటి సవాల్.. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

ఇవవ్నీ ఒక ఎత్తయితే.. వైసీపీ నాయకత్వానికి తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న పాజిటివ్ ఓటింగ్‌పై అపారమైన నమ్మకముంది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వైసీపీకి పటిష్టమైన ఓటు బ్యాంక్ ఏర్పడిందని.. అదే తమకు శ్రీరామరక్ష కానుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి ఉన్న కార్యకర్తల బలంతో పోల్ మేనేజ్మెంట్‌లోనూ తిరుగులేని ఆధిక్యత సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ వర్గాలు.

ఓవైపు టీడీపీ సెంటిమెంట్ అస్త్రాన్ని, మరోవైపు వైసీపీ సంక్షేమ మంత్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండింటిలో ఏది వర్కవుట్ అవుతుందో కాలమే సమాధానం చెప్పాలి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇటు వైసీపీ, అంటు టీడీపీ తమ వ్యూహానికి తగ్గట్లే పావులు కదపనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు