వైసీపీలో అక్కడ నేతల గ్రూపుల గోల.. కొన్నిచోట్ల ఇంచార్జ్‌లను మార్చాలంటున్న క్యాడర్

అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగుతుందో లేదోనని నిట్టూర్పుతో ఎదురు చూస్తున్నారట.

వైసీపీలో అక్కడ నేతల గ్రూపుల గోల.. కొన్నిచోట్ల ఇంచార్జ్‌లను మార్చాలంటున్న క్యాడర్

Updated On : February 20, 2025 / 8:25 PM IST

సిక్కోలు వైసీపీలో చిత్రవిచిత్రాలు కనిపిస్తున్నాయి. పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు పదవులను అనుభవించి..అధికార దర్పాన్ని ప్రదర్శించిన నేతలంతా..అధికారం పోయాక అంతా సైలెంట్ అయిపోయారట. అధికారంలో ఉన్నప్పుడు ఒంటెద్దు పోకడలతోనే నెట్టికొచ్చిన నేతలు..ఇప్పుడు అపోజిషన్‌లోకి వచ్చేసరికి కంటికి కూడా కనిపించడం లేదట.

దీంతో తమకు అండగా నిలబడని వారిని తప్పించాలంటూ అదిష్టానంపై తెగ ఒత్తిడి తెస్తున్నారట కార్యకర్తలు. ఇంచార్జ్‌ను మార్చాల్సిందేనంటూ పట్టుబడుతుండటంతో అధిష్టానం ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టిందన్న టాక్ నడుస్తుంది.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో గ్రూపుల గోల చల్లారడం లేదు. ఎన్నికలకు ముందు కూడా పార్టీలో గ్రూపు పాలిటిక్స్‌కు చెక్ పెట్టకపోవడంతో తీవ్ర నష్టం జరిగిందని అంటున్నారు క్యాడర్, లీడర్లు. వైసీపీ ముఖ్యనేతల దగ్గరే తమ ధిక్కార స్వరం వినిపిస్తున్నారట. ఇప్పుడైనా నియోజకవర్గ ఇంచార్జ్‌లను మార్చాలని లేకపోతే మరోసారి నష్టపోవాల్సి వస్తుందని పార్టీ పెద్దలకు తెగేసి చెప్తున్నారట క్యాడర్.

వీరిని తప్పించి..
అయితే ఇప్పటికే వైసీపీ అధిష్టానం కొంత నష్టనివారణ చర్యలు మొదలుపెట్టింది. ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్‌ తమ్మినేని సీతారాం, టెక్కలి ఇంచార్జ్ దువ్వాడ శ్రీనివాస్‌ను తప్పించింది. తమ్మినేనికి పార్లమెంటరీ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్‌కు టెక్కలి నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చింది అధిష్టానం.

ఇక మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇంచార్జులను మార్చాలని పట్టుబడుతున్నారట క్యాడర్. ముఖ్యంగా ఎచ్చెర్ల నియోజకవర్గ ఇంచార్జ్ గొర్లే కిరణ్ కుమార్, రాజాం ఇంచార్జ్‌గా ఉన్న డాక్టర్ తలే రాజేష్, పాతపట్నం ఇంచార్జ్ రెడ్డి శాంతి, ఇచ్చాపురం ఇంచార్జ్ పిరియా విజయలను మార్చాలని పట్టుబడుతున్నారట వైసీపీ కార్యకర్తలు, లీడర్లు. ఎలక్షన్ తర్వాత రాజాం నియోజకవర్గ పరిస్దితి మరింత దయనీయంగా తయారైందంట. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన డాక్టర్ తలేరాజేశ్ ఇప్పుడు పేరుకే ఇంచార్జ్‌గా ఉన్నారట.

పార్టీ కార్యక్రమాలకు కూడా పాల్గొనడం లేదట. అయితే రాజాం మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఇంచార్జ్‌గా ఉండేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. క్యాడర్‌ కూడా జోగులుకే జై కొడుతున్నారట. ఇక ఇచ్చాపురం నియోజకవర్గంలో గ్రూప్‌ పాలిటిక్స్‌ ఇబ్బందికరంగా మారాయట.

కొత్త వ్యక్తికి ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వాలని..
ఎమ్మెల్సీ నర్తు రామారావు, జడ్పీ ఛైర్మన్ పిరియా విజయసాయిరాజ్ వేర్వేరు వర్గాలను మెయింటెన్‌ చేస్తున్నారు. దాంతో ఇచ్చాపురంలో కొత్త వ్యక్తికి ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నారట స్థానిక నేతలు. ఇచ్చాపురంలో గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలంటే ఇంచార్జ్‌ను మార్చి కొత్త వ్యక్తిని నియమించాలంటున్నారట ద్వితీయ శ్రేణి నేతలు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూపుల గోలతో నిత్యం రచ్చకెక్కేవి ఎచ్చెర్ల పాతపట్నం నియోజకవర్గాలు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లు, నాటి ఎమ్మెల్యేల తీరు నచ్చక పలువురు వైసీపీని విడిచిపెట్టి వెళ్లారు. గోర్లే కిరణ్‌ను మార్చాలని ఎచ్చెర్లలోని ఆయన వ్యతిరేక గ్రూపు డిమాండ్ చేస్తోందట.

ఇక పాతపట్నంలో నాన్ లోకల్ అయిన రెడ్డి శాంతిని తప్పించి స్థానిక నేతలకు నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టాలంటున్నారు క్యాడర్. ఘోర ఓటమి పాలైనా నేతల గ్రూపుల గోల మాత్రం చల్లారడక పోవడంతో కార్యకర్తలు విసిగిపోతున్నారట. అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగుతుందో లేదోనని నిట్టూర్పుతో ఎదురు చూస్తున్నారట. సిక్కోలు నేతలను వైసీపీ అధినేత ఎంతవరకు సెట్‌ చేస్తారో చూడాలి మరి.