AB Venkateswara Rao
ఇవాళే పోస్టింగ్ తీసుకున్న సీనియర్ ఐపీఎస్, డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఇవాళ సాయంత్రం పదవీ విరమణ చేశారు. ఆయనకు పలువురు వీడ్కోలు తెలిపారు. ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రిటైర్ అయినప్పటికీ తన ఊపిరి ఉన్నంతవరకు ప్రజా సేవలో ఉంటానని తెలిపారు.
తన శేష జీవితంలోనూ అన్యాయాన్ని, అణచివేతను ఎదురిస్తానని అన్నారు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణకు తన రిటైర్డ్ జీవితంలో అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. తనకు ఆప్తులుగా ఉండి, అండగా ఉన్న వారికి రుణపడి ఉంటానని అన్నారు.
తాను ఇంజినీరింగ్ చదువుకుని మొదట టాటా మోటార్స్ లో ఉద్యోగం చేశానన్నారు. అదే సంస్థలో ఉన్నా, అమెరికా వెళ్లినా ఇప్పుడు తన జీవితం వేరే విధంగా ఉండేదని తెలిపారు. ఓ ఐపీఎస్‌గా అన్యాయాన్ని ఎదుర్కోవడమే తన వృత్తిధర్మంగా పనిచేశానని చెప్పారు. తన సర్వీసులో చట్టాన్ని కాపాడేండేందుకు కృషి చేశానన్నారు. తాను అన్యాయాన్ని ఎదుర్కొన్నా తప్ప ఎవరికీ అన్యాయం చేయలేదని తెలిపారు. తాను ఇవాళ పూర్తి సంతృప్తితో రిటైర్ అవుతున్నానని చెప్పారు.
తన సర్వీసులో నీతి, నిజాయితీతో వ్యవహరించానని తెలిపారు. ఎవరికీ అన్యాయం చేయకపోవడంతోనే ఇవాల తాను లక్షలాది మంది అభిమానాన్ని పొందుతున్నానని చెప్పారు. తన నిజాయితీ, పోరాటమే తనను కాపాడిందని అన్నారు. తన సర్వీసులో దుర్మార్గులనూ చూశానని తెలిపారు. తనకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
Also Read: ఎన్నికల ఫలితాలను తేల్చే ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఇంత ఉత్కంఠ ఎందుకు నెలకొందో తెలుసా?