అమరావతికి మరలా వస్తున్నా..రైతుల గొంతు వినిపిస్తా – పవన్

  • Publish Date - February 5, 2020 / 10:25 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అమరావతిలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత అక్కడ పర్యటించేందుకు ఫిక్స్ అయిపోయారు. రాజధాని రైతులకు తాను అండగా ఉంటానని ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా జనసేననీ ఓ ట్వీట్ చేశారు. అమరావతి రాజధానిగా ఉండాలి..దానికే నా మద్దతు అంటూ ప్రకటించారు. 50 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతుల గొంతును మరోసారి వినిపిస్తానని వెల్లడించారు. 

రాజధానిని తరలించొద్దంటూ..50 రోజులుగా మహిళలు, రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. సడలని ఉద్యమ స్పూర్తి, శాంతియుత పంథా చూసి తెలుగు వారు గర్విస్తున్నారని తెలిపారు పవన్.  అమరావతి కోసం నిస్వార్దంగా 33 వేల ఎకరాల భూమిని ఆనాటి ప్రభుత్వానికి సమర్పించి..ఇప్పుడు రోడ్డున పడిన రైతన్నకు సర్వదా అండగా ఉంటానని గతంలోనే మాటిచ్చినట్లు గుర్తు చేశారు. ఉద్యమానికి మరోసారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పవన్ తెలిపారు. 

ఇదిలా ఉంటే…మూడు రాజధానుల విషయంలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాజధాని ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని.. కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంటున్న కేంద్రం.. ఏపీ రాజధాని విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడంలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.

తుళ్లూరులో అమరావతి రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న రైతులకు చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు. మూడు రాజధానులంటూ జగన్ తుగ్లక్ లా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. 
మరోవైపు రాజధాని విషయంలో ప్రభుత్వం వెనుకంజ వేయడం లేదు. ఆంధ్రరాష్ట్ర లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, మూడు రాజధానులు అనేది అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే అని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు.