Pawan On Ruia Incident : వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే మాఫియా జులుం : రుయా ఘటనపై పవన్ ఆగ్రహం

వరుసగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ తీరు వల్లే మాఫియా జులుం చూపిస్తోంది.

Pawan On Ruia Incident

Pawan On Ruia Incident : రాష్ట్రంలో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై పవన్ విరుచుకుపడ్డారు. రుయా దయనీయ ఘటనకు ప్రభుత్వమే కారణం అని పవన్ ఆరోపించారు. ”కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోయారు. విద్యుత్ కోతలతో కడప రిమ్స్ లో మరణాలు చోటు చేసుకున్నాయి.

ఎవరో ఒక డాక్టర్ ని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఉచిత అంబులెన్స్ సేవలు ఆపేయడం వల్ల నరసింహ తన బిడ్డ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి పడిన కష్టం, వేదన దృశ్యాలు చూశాను. ప్రైవేట్ అంబులెన్స్ ఆపరేటర్లు డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేక.. చనిపోయిన తొమ్మిదేళ్ల బిడ్డ మృతదేహాన్ని భుజంపైన వేసుకుని 90 కిలోమీటర్ల బైక్ మీద వెళ్లిన ఆ ఘటన కలచి వేసింది. బిడ్డను కోల్పోయిన నరసింహ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.(Pawan On Ruia Incident)

Ruia Ambulance Mafia : రుయాలో అంబులెన్స్‌ మాఫియా ఆగడాలు.. 90కి.మీ బైక్‌పైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి

వరుసగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ తీరు వల్లే మాఫియా జులుం చూపిస్తోంది. ఎక్కడో వెనకబడ్డ రాష్ట్రాల్లో రుయాలో చోటు చేసుకున్న ఘటనలు గురించి చదివే వాళ్లం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చోటు చేసుకుంది. వైద్య రంగం మీద ప్రభుత్వం ఏపాటి శ్రద్ధ చూపుతుందో తెలుస్తుంది. మాఫియాపైన, వారిని పెంచి పోషిస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలి” అని పవన్ డిమాండ్ చేశారు.

అసలేం జరిగిందంటే..
తిరుపతి రుయా ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మితిమీరాయి. దందా చేస్తూ పేదలను పీడిస్తున్నాయి. అప్పటికే కొడుకు చనిపోయిన బాధలో ఉన్న ఓ తండ్రికి అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మరింత కుమిలిపోయేలా చేశాయి. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రుయా అంబులెన్సు డ్రైవర్లు.. కేవలం 90 కిలోమీటర్ల దూరానికి రూ.20 వేలు అడిగి దౌర్జన్యం చేశారు. అంతేకాదు.. ఉచిత అంబులెన్సు వచ్చినా డ్రైవర్ ను బెదిరించి తన్ని తరిమేశారు.(Pawan On Ruia Incident)

దీంతో ఆ తండ్రి తన కన్నకొడుకు మృతదేహాన్ని బైకుపై తీసుకెళ్లాల్సి వచ్చింది. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన జైశ్వ అనే చిన్నారి ఇటీవల అనారోగ్యానికి గురికాగా.. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతిన్నాయి. పని చేయడం మానేశాయి. దీంతో నిన్న రాత్రి 11 గంటలకు బాలుడు కన్నుమూశాడు.

Minister Vidadala Rajini: అంబులెన్సు మాఫియాను వదిలిపెట్టం: వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని

అయితే, కొడుకు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లేందుకు ఆ తండ్రి బయట ఉన్న అంబులెన్సు డ్రైవర్లను అడిగాడు. అంబులెన్సు డ్రైవర్లు రూ.20 వేలు ఇస్తేనే వస్తామంటూ డిమాండ్ చేయడంతో తన వల్ల కాదని ఆ తండ్రి చేతులెత్తేశాడు. నిజానికి బాలుడి తండ్రి నర్సింహులు రోజువారి కూలీ. పొలం దగ్గర కాపాలా కాస్తూ జీవిస్తుంటాడు. ఈ నేపథ్యంలో రూ.20 వేలు తను భరించలేనని.. వారి కాళ్లవేళ్ల పడ్డాడు. అయినా వారు కనికరించలేదు. ఇక లాభం లేదనుకున్న నర్సింహులు.. గ్రామంలోని బంధువులకు ఇదే విషయాన్ని చెప్పడంతో.. వారు ఉచిత అంబులెన్సు సర్వీసును పంపారు.

ఆసుపత్రికి వచ్చిన ఉచిత అంబులెన్స్ డ్రైవర్ ను రుయా ఆసుపత్రి వద్ద మాఫియాగా ఏర్పడిన అంబులెన్స్ డ్రైవర్లు అడ్డుకుని కొట్టారు. అక్కడి నుంచి తరిమేశారు. అంబులెన్స్ తీసుకుని లోపలికి వస్తే చంపేస్తామని డ్రైవర్ ను బెదిరించారు. తమ అంబులెన్సుల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ అరాచకానికి తెరతీశారు. దీంతో ఆ తండ్రి చేసేదేమీ లేక తన బైక్ పైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లిపోయాడు. కాగా, ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయని, అయినా అంబులెన్సు డ్రైవర్ల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.