Minister Vidadala Rajini: అంబులెన్సు మాఫియాను వదిలిపెట్టం: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై సూపరింటెండెంట్ డాక్టర్ భారతి వివరణ కోరినట్లు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, అంబులెన్సు మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి రజిని హెచ్చరించారు

Tirupatio
Minister Vidadala Rajini: తిరుపతి రుయా ఆసుపత్రిలో అంబులెన్సు మాఫియా పేట్రేగిపోయారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు రూ.20 వేలు డిమాండ్ చేయడమే కాకుండా, తమను కాదని మృతదేహాన్ని తరలించేందుకు ప్రైవేటు అంబులెన్సు ఆసుపత్రిలోకి వస్తే చంపేస్తామంటూ ఆసుపత్రిలో ఉండే అంబులెన్సు డ్రైవర్లు బాధితులను బెదరించారు. దీంతో ఏమి చేయాలో పాలుపోని బాధితుడు, కన్నకొడుకు మృతదేహాన్ని 90 కిలోమీటర్ల మేర బైక్ పైనే తీసుకువెళ్లాడు. ఈ ఘటన మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఈఘటనపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖా మంత్రి విడదల రజిని స్పందించారు. గుంటూరులో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై సూపరింటెండెంట్ డాక్టర్ భారతి వివరణ కోరినట్లు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, అంబులెన్సు మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి రజిని హెచ్చరించారు. మృతదేహాల విషయంలో వ్యాపారం చేసే దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి అన్నారు.
మృతుడి కుటుంబ సభ్యులను ప్రైవేటు వ్యక్తులు బెదిరించారా..? ఆస్పత్రి సిబ్బందే బెదిరింపులకు పాల్పడ్డారా.. అనే కోణంలో విచారణ చేపట్టాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించినట్లు మంత్రి వివరించారు. విచారణలో ఎవరి తప్పు ఉన్నా వదిలిపెట్టమని, కఠినంగా చర్యలు తీసుకుంటామని మంత్రి రజిని పేర్కొన్నారు. ప్రైవేటు అంబులెన్సుల ప్రమేయం లేకుండా మహాప్రస్తానం అంబులెన్సులు 24 గంటలూ పనిచేసేలా త్వరలోనే ఒక విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతదేహాలను వీలైనంతవరకు మహాప్రస్తానం వాహనాల ద్వారానే ఉచితంగా తరలించేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో ప్రైవేటు అంబులెన్సులను నియంత్రిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాజ్యమేలుతున్న ప్రైవేటు అంబులెన్సుల యజమానులు, డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు మంత్రి విడదల రజిని తెలిపారు.