4G Internet Services : ఏపీలో అత్యంత మారుమూల గ్రామాల్లోకి 4జీ సేవలు.. కొత్తగా 164 సెల్ టవర్లను ప్రారంభించిన సీఎం జగన్
4G Services Remote Villages in Andhra Pradesh : యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ప్రాజెక్ట్ కింద ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో 4జీ సర్వీసులను విస్తరించడానికి జియో ఈ టవర్‌లను ఏర్పాటు చేసింది.

Jio Partners with AP Government to Extend 4G Connectivity to Remote Villages
4G Internet Services to Remote Villages : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ 4జీ నెట్‌వర్క్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంతో దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో పెద్ద సంఖ్యలో 4జీ సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా గురువారం (జనవరి 25) ఇక్కడ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్‌గా 164 సెల్‌టవర్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
ఇప్పటికే, మరో టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ ఆధ్వర్యంలో 136 సెల్ టవర్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయగా.. జియో ఆధ్వర్యంలో కొత్తగా మరో 164 టవర్లు ఏర్పాటు చేసింది. దాంతో ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 300 వరకు 4జీ నెట్‌వర్క్ టవర్లను ఏపీ సీఎం ప్రారంభించారు.
Read Also : CM Jagan: జియో టవర్లను ప్రారంభించిన సీఎం జగన్
గత ఏడాది జూన్‌లో 100 జియో టవర్లు ప్రారంభం :
అందులో అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లాలో 246 సెల్ టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్ ఉన్నాయి. ఈ టవర్ల ఏర్పాటు చేయడం ద్వారా 944 ఆవాసాలకు, 2 లక్షల మంది ప్రజలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. గత ఏడాది జూన్‌లో రాష్ట్రంలో జియో 100 టవర్ల ఏర్పాటు చేయగా.. ఇప్పుడు కొత్తగా ప్రారంభమైన 300 టవర్లతో కలిపి మొత్తంగా 400 టవర్లను ఏర్పాటు చేశారు. కొత్త టవర్ల ప్రారంభంతో మొత్తం జియో టవర్ల సంఖ్య 264కు చేరుకుంది.

Jio 4G Connectivity to Remote Villages
దాదాపు 400 కోట్లు ఖర్చు చేశాం : సీఎం జగన్
4జీ సెల్ టవర్లను ప్రారంభించిన సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా ప్రాంతాల గిరిజనులతో సీఎం జగన్ మాట్లాడారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని టవర్లను జియో విస్తరించనుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సెల్ టవర్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమైందని తెలిపారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5,549 మారుమూల గ్రామాలకు 4జీ సర్వీసులను అందించాలని ప్రభుత్వం భావిస్తోందని సీఎం జగన్ చెప్పారు. 4జీ సెల్ టవర్ల ఏర్పాటు కోసం దాదాపు 400 కోట్లు ఖర్చు చేశామన్నారు.
400 టవర్ల ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఇవాళ ఏర్పాటు చేసిన కొత్త టవర్ల ద్వారా మరో 2 లక్షల మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఏపీ సీఎం చెప్పారు. మొత్తంగా కలిపి 2887 టవర్లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం మొత్తంగా రూ. 3,119 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇప్పటికే టవర్లకు అవసరమైన భూములను కూడా వెంటనే అప్పగించినట్టు తెలిపారు.
అత్యంత మారుమూల ప్రాంతాల్లోకి 4జీ సేవలు :
అత్యంత మారుమూల ప్రాంతాలు 4జీ నెట్‌వర్క్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. తద్వారా సమాచార సంబంధాలు బాగా మెరుగుపడతాయన్నారు. అంతేకాదు.. ఈ మారుమూల ప్రాంతాలకు పథకాల అమలు కూడా మరింత సులభతరం అవుతుందని తెలిపారు. దాంతో వేగంగా, పారదర్శకంగా పనులు ముందుకు సాగుతాయని, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లిషు మీడియం స్కూల్స్ గ్రామ రూపురేఖలను మారుస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ఐటీ సెక్రటరీ కోన శశిధర్, జియో ఆంధ్రప్రదేశ్ సీఈవో మందపల్లి మహేష్ కుమార్, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.