వైసీపీ సస్పెన్షన్ వేటు వేయడంతో మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి కంటతడి.. ఏమన్నారో తెలుసా?
PV Sidda Reddy: జగన్ తనకు నేరుగా చెప్పి ఉంటే తానే తప్పుకునే వాడినని తెలిపారు. కొందరు డబ్బులు, పదవుల కోసం పార్టీని నాశనం చేశారని చెప్పారు.

Pedaballi Venkata Sidda Reddy: శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేయడంతో ఆయన కంటతడి పెట్టుకున్నారు. తాను వైసీపీకి ఎన్నడూ ద్రోహం చేయలేదని చెప్పారు. పార్టీనే తనకు ద్రోహం చేసిందని అన్నారు. పదేళ్లుగా ఒక్కో ఇటుక పేర్చుతూ పార్టీని బలోపేతం చేశానని తెలిపారు. తనను సస్పెండ్ చేయడం దురదృష్టకరమని చెప్పారు.
తాను ఎమ్మెల్యేగా ఉండగానే ఇన్‌ఛార్జిని తీసుకొచ్చి అవమానించారని, అంతేగాక అధికారులకు తాను ఫోన్ చేస్తే పలకవద్దని కట్టడి చేశారని అన్నారు. జగన్ తనకు నేరుగా చెప్పి ఉంటే తానే తప్పుకునే వాడినని తెలిపారు. కొందరు డబ్బులు, పదవుల కోసం పార్టీని నాశనం చేశారని చెప్పారు. మక్బూల్ నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకుని ఆయననే ఓడించారని అన్నారు.
రేపటి నుంచి తన రాజకీయం మళ్లీ చూస్తారని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరతానన్నదానిపై తన ఆప్తులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కాగా, ఏపీ ఎన్నికల్లో సిద్ధారెడ్డి వైసీపీ వ్యతిరేకంగా పనిచేసినట్టు చెబుతూ ఆయనను సస్పెండ్ చేశారు. ఎన్నికల్లో సిద్ధారెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదు. కదిరి నియోజక వర్గ టికెట్‌ను మక్బూల్ అహ్మద్‌కు ఇచ్చింది. ఆయనపై టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ గెలిచారు.
Also Read: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట