నెరవేరిన విజయవాడ ప్రజల చిరకాల కల.. కనకదుర్గ, బెంజి సర్కిల్ ఫ్లైఓవర్లు ప్రారంభం

kanaka durga benz circle flyovers: ఎట్టకేలకు విజయవాడ ప్రజల చిరకాల కల నెరవేరింది. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన కనకదుర్గ, బెంజి సర్కిల్ ఫ్లైఓవర్లు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం(అక్టోబర్ 16,2020) వర్చువల్ ద్వారా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కిమీ వంతెన నిర్మించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. ఫ్లైఓవర్ నిర్మాణంతో నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
కనకదుర్గ ఫ్లైఓవర్ తో పాటు 16 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మొత్తం రూ.15వేల 592 కోట్ల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. దుర్గగుడి ఫ్లైఓవర్ ని జాతికి అంకితం చేశారు సీఎం జగన్. ప్రధాని మోడీ మార్గదర్శకంలో జాతీయ రహదారుల రూపురేఖలే మారిపోయాయని అన్నారు. ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎంతో చొరవచూపారని జగన్ చెప్పారు. రహదారుల అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర అభివృద్ధి కార్యక్రమాల్లోనూ తమ సహకారం ఉంటుందని సీఎం జగన్ చెప్పారు.
కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రత్యేకతలు:
* దేశంలోనే పొడవైన వంతెన
* ఢిల్లీ, ముంబై తర్వాత మూడో అతిపెద్ద వంతెన
* రెండున్నర కిలోమీటర్ల మేర నిర్మాణం
* వారథి నిర్మాణానికి ఐదేళ్ల సమయం
* రూ.502కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణం
* మొత్తం వ్యయం రూ.447.80 కోట్లు
* రాష్ట్ర వాటా రూ.114.59 కోట్లు
* కేంద్రం వాటా రూ.33.21 కోట్లు
* పలు మార్లు వాయిదా పడిన దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
* ఫ్లైఓవర్ లో మొత్తం 47 పిల్లర్లు
* స్పైన్స్ తో 46 స్పాన్ బాక్సుల నిర్మాణం
* సింగిల్ పిల్లర్స్ మీదనే వంతెన నిర్మాణం
విజయవాడ నగరానికి మరో మణిహారం
విజయవాడ నగరానికి మరో మణిహారంగా రెండు ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. కనకదుర్గ, బెంజి సర్కిల్ ఫ్లైఓవర్లను కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ప్రారంభించారు. వర్చువల్‌గా జరిగిన ప్రారంభోత్సవంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. అలాగే 15 వేల కోట్ల విలువైన మరో 61 ప్రాజెక్టులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పటికే 8 వేల కోట్లతో పూర్తయిన 10 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
అనేక వాయిదాల తర్వాత చివరికి ప్రారంభం:
కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు పూర్తై చాలా రోజులైంది. అయితే.. ప్రారంభోత్సవానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. వాస్తవానికి సెప్టెంబర్ 4నే దుర్గగుడి ఫ్లెఓవర్‌ను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు సంతాప దినాలు ఉన్నందున ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. ఆ తర్వాత సెప్టెంబర్ 18న ముహూర్తం పెట్టారు. ఫ్లైఓవర్‌ను ప్రారంభించాల్సిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ సమయంలో కరోనా బారినపడ్డారు.
దీంతో దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. ఇన్ని వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఇవాళ(అక్టోబర్ 16,2020) వారధి అందుబాటులోకి వచ్చింది. బెంజి సర్కిల్ పైవంతెన కూడా ప్రారంభమైంది. దీంతో బెజవాడ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. నగర పౌరుల ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి.
కనకదుర్గ ఫ్లై ఓవర్.. ఒక ఇంజనీరింగ్ అద్భుతం:
కనకదుర్గ ఫ్లై ఓవర్.. ఒక ఇంజనీరింగ్ అద్భుతం. స్పైన్ అండ్ వింగ్స్ టెక్నాలజీతో దేశంలోనే నిర్మితమైన అతి పొడవైన వంతెన. ఢిల్లీ, ముంబై తర్వాత ఈ టెక్నాలజీతో దేశంలో నిర్మించిన మూడవ వంతెన ఇది. అలాగే అతి పొడవైనది కూడా. దీన్ని జాతికి అంకితం చేసే క్రమంలో ప్రజలకు ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూపించడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో డ్రోన్ వీడియోతో చిత్రీకరించింది. ఫ్లైఓవర్‌పై తీసిన డ్రోన్ వ్యూ అందరినీ ఆకట్టుకుంది.
రూ.447 కోట్లు, 2.3 కిమీ పొడవు:
కేంద్ర ప్రభుత్వ సాయంతో విజయవాడ బస్టాండ్ నుంచి పున్నమి ఘాట్ వరకు ఈ వారధిని నిర్మించారు. 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లై ఓవర్‌ను 447 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఇందులో భూ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం114 కోట్ల 59లక్షలు కేటాయించగా…. కేంద్ర ప్రభుత్వ వాటా 333కోట్ల 21 లక్షలు. దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రాజెక్టులో నాలుగు వరుసల రోడ్డు, ఆరు లేన్లు అంతర్భాగంగా ఉన్నాయి. ఆరు వరుసల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిడివి 2కిలోమీటర్ల 600మీటర్లు. దీని వ్యయం 211 కోట్ల 31లక్షలు. ఈ ప్రాజెక్టును సోమా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. టెండర్లలో ఎల్ అండ్ టీ సంస్థతో పోటీపడి మరీ తక్కువకు కోట్ చేసి దక్కించుకుంది.
ఫ్లైఓవర్ పూర్తి కావటానికి దాదాపుగా ఐదేళ్ల సమయం:
దుర్గగుడి పైవంతెన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 2015 డిసెంబరు 28ని అపాయింట్ డేట్‌గా ఇచ్చింది. పన్నెండు నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. అయితే, విభిన్నమైన టెక్నాలజీ, సాంకేతిక పరమైన అంశాల కారణంగా ఈ ఫ్లై ఓవర్ పూర్తి కావటానికి దాదాపుగా ఐదేళ్ల సమయం తీసుకుంది. మొత్తం 47 పిల్లర్లపై ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. అందులో ఆరు భారీ వై పిల్లర్స్ ఉన్నాయి. అందులో 667 స్పైన్స్ నిర్మించారు.
ఈ స్పైన్స్‌తో 46 స్పాన్ బ్లాక్స్‌లను నిర్మించారు. ఈ స్సైన్స్‌కు 1,406 రెక్కలను అమర్చారు. 47 సింగిల్ పిల్లర్స్ మీదనే ఆరు వరసలతో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగింది. సింగిల్ పిల్లర్ల మధ్యలో స్పైన్స్ సమూహమైన స్పాన్‌ను అమర్చారు. దీనికి రెండు వైపులా రెక్కలను జతచేసి ఐరన్‌తో స్ర్టెచ్చింగ్ చేశారు.