Kodikatthi Srinu
Kodikathi Srinu: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఐదేళ్ల క్రితం జరిగిన ‘కోడికత్తి’తో దాడి కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో బెయిల్ మంజూరు చేయడంతో అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. 10టీవీతో శ్రీను విజయవాడలో మాట్లాడుతూ… తాను జైల్లో ఉండి డిగ్రీ చదివానని తెలిపాడు.
డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యానని శ్రీను చెప్పాడు. ఎంఏ సోషయాలజీ చదువుతానని అన్నాడు. జైల్లో తాను చదువుకునేందుకు అనేకమంది ప్రోత్సహించారని చెప్పాడు. తనకు ప్రత్యేకంగా జైల్లో టీచర్ చదువు చెప్పారని అన్నాడు. వాళ్ల సహాయ, సహకారాల వల్లే తాను జైల్లో చదువుకుని డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానని తెలిపాడు.
శ్రీనివాస్ తల్లి మాట్లాడుతూ.. తమ అబ్బాయి కోసం నిరాహార దీక్ష కూడా చేశానని అన్నారు. ఎట్టకేలకు తన అబ్బాయి జైలు నుంచి రిలీజ్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
రోజువారీ పనులు వదులుకుని తన తమ్ముడు జైలు నుంచి బయటకు రావాలని అనేక ప్రజాసంఘాలను కలిశానని శ్రీను సోదరుడు తెలిపారు. చివరకు న్యాయం గెలిచిందని, తన తమ్ముడు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చాడని అన్నారు.
లాయర్ అబ్దుల్ సలీం మాట్లాడుతూ.. ఈ కేసును చాలా ఛాలెంజ్ గా తీసుకున్నానని తెలిపారు. చివరికి న్యాయం గెలిచిందని అన్నారు. కోడికత్తి శ్రీనివాస్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఈ కేసును పూర్తిగా కొట్టేసేందుకు సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ వేస్తానని తెలిపారు.
Read Also: Narendra Modi: 17వ లోక్‌సభలో ప్రధాని మోదీ చివరి ప్రసంగం.. ఏమన్నారో తెలుసా?