TDP Crisis
TDP Crisis – Chandrababau Arrest : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్. నెక్ట్స్ లోకేశ్, అచ్చెన్నాయుడు అంటూ సీఐడీ, మంత్రులు చేస్తున్న ప్రకటనలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మూడు రోజుల క్రితం నంద్యాలలో మొదలైన పొలిటికల్ హీట్ నిరంతరాయంగా కొనసాగుతోంది. చంద్రబాబు రిమాండ్ తర్వాత జరగబోయే పరిణామాలు ఊహిస్తే ఏపీ రాజకీయ వేడి ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు.
ప్రస్తుతం 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకి ఎప్పుడు బెయిల్ వస్తుంది? రాకపోతే ఎన్నాళ్లు జైల్లో ఉండాల్సి వస్తుంది? ఇక లోకేశ్, అచ్చెన్నాయుడులపై సీఐడీ చర్యలకు దిగితే పరిస్థితి ఏంటి? కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి అనే తరుణంలో టీడీపీని చుట్టుముట్టిన సవాళ్లు ఏంటి?
42ఏళ్ల టీడీపీ చరిత్రలో ఆ పార్టీ ఎన్నో సంక్షోభాలు, మరెన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. కానీ, ఇప్పటిలా ఆ పార్టీ అధినాయకత్వం ఎప్పుడూ కేసుల్లో ఇరుక్కుని జైలుకి వెళ్లిన చరిత్ర లేదు. కానీ, తొలిసారిగా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చిక్కుకుని టీడీపీ అధినేత చంద్రబాబు జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. తాను నిప్పునని, కడిగిన ముత్యం అని చెప్పుకునే చంద్రబాబుకి ఇది నిజంగా కష్టకాలమే. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఊహించి ఉండరు.
ఎంత గొప్ప లీడర్ అయినా ఒక్కోసారి ఒడిదుడుకులను ఎదుర్కోవడం సహజం. ప్రస్తుతం చంద్రబాబు అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే చంద్రబాబు తప్ప మరో ముఖ్య నేత, ప్రజాకర్షణ ఉన్న లీడర్ లేని టీడీపీకి అధినేత జైలుకెళ్లడం పరీక్షా కాలంగా మారింది. ఇన్నాళ్లూ టీడీపీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీగా నడిచింది. ఇలాంటి సమయంలో చంద్రబాబు అరెస్ట్ ద్వారా అతిపెద్ద చాలెంజ్ ని ఎదుర్కోంటోంది తెలుగుదేశం పార్టీ.
ఎన్నికలకు ముందు అనూహ్యంగా తెరపైకి వచ్చినే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఇరుక్కున్నారు చంద్రబాబు. ఒక్క చంద్రబాబే కాదు ఆయన కుమారుడు లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి కూడా సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తోంది ప్రభుత్వం. స్కామ్ లో లోకేశ్ పాత్రపైనా దర్యాఫ్తు చేస్తున్నట్లు చంద్రబాబు అరెస్ట్ జరిగిన రోజే ప్రకటించింది సీఐడీ.
సీఐడీ చెప్పినట్లు నిజంగా లోకేశ్ కు ప్రమేయం ఉంటే టీడీపీకి మరిన్ని చిక్కులు తప్పవంటున్నారు పరిశీలకులు. ఒకవైపు అధినేత నిర్బంధం.. మరోవైపు యువనేతకు పొంచి ఉన్న కేసుల ముప్పుతో క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుంది టీడీపీ. ఇలాంటి సమయంలో టీడీపీని నడిపించేది ఎవరు? ఎన్నికల్లో గెలిపించేది ఎవరు? అన్నది పెద్ద చర్చకు దారితీస్తోంది.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై సీఐడీ మరింత లోతుగా విచారణ చేస్తే అచ్చెన్నాయుడికి సమస్యలు తప్పవా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి రోజా చెప్పినట్లు అచ్చెన్నాయుడిపైనా చర్యలు ఉంటాయా? అనే దానిపై కాలమే సమాధానం చెప్పాలి.
1982లో ఆవిర్భవించిన టీడీపీకి తొలుత పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ మాత్రమే పెద్ద దిక్కు. 1995లో చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టేవరకు ఏ ఎన్నికలైనా ఎన్టీఆర్ జనాకర్షణతోనే ఎదుర్కోనే వారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటివరకు టీడీపీకి ఆయనే ప్రధాన నాయకుడు. చంద్రబాబు తర్వాత ప్రస్తుతానికి టీడీపీలో నెంబర్ 2, నెంబర్ 3 నాయకులు ఎవరూ లేరు.
ఇప్పుడిప్పుడే చంద్రబాబు తర్వాతి స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో అడుగులు వేస్తున్న లోకేశ్ ను కూడా టార్గెట్ చేస్తోంది ప్రభుత్వం. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న నాయకులు ఎందరో ఉన్నా ఏ ఒక్కరూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేయగల స్థితిలో లేరు. రాష్ట్రం వరకు ఎందుకు. వారి వారి సొంత జిల్లాల నాయకత్వాన్నే సరిదిద్దగల సామర్థ్యం ఉన్నవారు కూడా అతికొద్దిమందే ఉన్నారు.
ఇప్పటికీ టీడీపీలో అంతర్గత సమస్యలపై అధినేత చంద్రబాబు వద్దే పంచాయితీలు జరుగుతుంటాయి. ఇప్పుడు చంద్రబాబు అందుబాటులో లేని పరిస్థితుల్లో లోకేశ్, అచ్చెన్నాయుడిలపై కూడా కేసుల కత్తి వేలాడుతున్న సందర్బంలో పార్టీ భవిష్యత్తు ఏంటి?అనేది ప్రధానంగా చర్చకు దారితీస్తోంది.
తెలుగుదేశంలో చంద్రబాబతో పాటు సమకాలీన రాజకీయాలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అశోక్ గజపతి రాజు, అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, ఏఈ కృష్ణమూర్తి, జ్యోతుల నెహ్రూ ఇలా 40ఏళ్లకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్న నేతలు.. ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమ, సోమిరెడ్డి, ఆళ్లపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బోండా ఉమ, బుద్ధా వెంకన్న.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో నేతలు ఉన్నారు. వీరిలో చాలామంది పత్రికా ప్రకటనలు, మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితం. క్షేత్రస్థాయిలో పార్టీని చక్కదిద్దే సామర్థ్యంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి నాయకులుగా చెలామణి అయిన వారు సైతం వారి సొంత జిల్లాల్లో వారి వారి సొంత నియోజకవర్గాలకే పరిమితం అవుతుంటారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరీక్షా కాలాన్ని ఎలా అధిగమిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు అరెస్ట్ తో తెలుగుదేశం పార్టీ మొత్తం సందిగ్ధావస్థలో పడినట్లు కనిపిస్తోంది. ఎన్నికలు తరుముకొస్తున్న పరిస్థితుల్లో బాబుకు బెయిల్ లభిస్తుందా? లేదా? అన్నది ముఖ్య అంశంగా మారిపోయింది. ఒకవేళ ఏదైనా కారణాలతో చంద్రబాబు అంత త్వరగా బయటపడలేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అన్నది కార్యకర్తలను భయపెడుతోంది. ఎన్నికలకు సన్నద్ధం అవ్వాల్సిన సమయంలో చంద్రబాబు కార్యక్రమాలన్నీ ప్రస్తుతానికి రద్దైపోయాయి. ఇక లోకేశ్ పాదయాత్ర మధ్యలో ఉంది. అధికార పార్టీ నేతలు, మంత్రులు చెబుతున్నట్లుగా లోకేశ్ ను కూడా కేసులు చుట్టుముడితే క్షేత్రస్థాయి పోరాటంలో టీడీపీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది.
ప్రస్తుతం ఓటర్ల చేర్పులు, తొలగింపులపై టీడీపీ పోరాడుతోంది. ఇసుక, మద్యం, నిత్యవసరాల ధరలపై ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ ఆందోళనలు, ధర్నాలు చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్య అంశాలను ప్రకటించడంతో పాటు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే మరో కార్యక్రమం పేరిట జిల్లాల్లో విస్తృత పర్యటనలకు ప్లాన్ చేసింది. బాబు అరెస్ట్ తో ఈ ఉద్యమాలు, ఆందోళనలు, కార్యక్రమాలు అన్నీ నిలిచిపోయాయి.
బాబు, లోకేశ్ తప్పిస్తే మిగతా నేతలు ఎవరూ సొంతంగా ఈ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టే వాతావరణం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనలేదు. బాబు అరెస్ట్ తర్వాత మొత్తం బాధ్యతలను మీదకు వేసుకుని పార్టీని నడిపించే నాయకుడు ఎవరన్న చర్చ కొనసాగుతోంది. అన్నింటికి మించి అనేక కేసులు టీడీపీ నాయకులను భయపెడుతున్నాయి. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఇరుక్కున్న చంద్రబాబుపై అమరావతి భూములు, పుంగనూరు అల్లర్ల కేసులు వెంటాడుతున్నాయి. అచ్చెన్నాయుడిపై ఇప్పటికే ఈఎస్ఐ స్కామ్ కేసు ఉంది. లోకేశ్ సహా చాలా మంది నాయకులపై రకరకాల కేసుల కత్తి వేలాడుతోంది.
ఎన్నికల సమయానికి ఏదో ఒక కారణంతో ప్రధాన నాయకులు అందుబాటులో లేకపోతే పార్టీ, కేడర్ పరిస్థితి ఏంటన్నదే ప్రధాన ప్రశ్న. ప్రస్తుత రాజకీయాల్లో కేసుల వెనుక వాస్తవం ఏంటి అనేదానికంటే, కేసుల ప్రభావం ఎంత అనేదే ముఖ్యం. ఒకసారి ఒక నాయకుడు అందునా ప్రతిపక్ష నాయకుడు ఏదైనా కేసులో చిక్కుకుంటే బయటపడటం అంత తేలిక కాదు. ముప్పతిప్పలు పడతారు. సీఎం జగన్ కూడా గతంలో ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నారు. జనం అండగా నిలబడటంతో అధికారం చేపట్టగలిగారు.
కేసుల వల్ల జనంలో జగన్ కు లభించిన సానుభూతి వల్లే ఇది సాధ్యమైందని, చంద్రబాబుకి ఇలానే కలిసి వస్తుందని నమ్మేవారు ఉన్నారు. అయితే ఈ రెండు కేసుల్లో ఉన్న ప్రధాన తేడా ఏంటంటే.. ఎన్నికలు సమీపిస్తున్న సమయానికి జగన్ జైలు నుంచి జనంలోకి వచ్చారు. చంద్రబాబు జనం నుంచి జైలుకెళ్లారు. అందుకే చంద్రబాబుకి, టీడీపీకి ఇది నిజంగా విషమ పరీక్షా సమయం. ఈ పరీక్షా సమయాన్ని టీడీపీ ఎలా ఎదుర్కొనగలదు అనే దానిపైనే భవిష్యత్తు ఎన్నికల ఫలితాలు ఉంటాయనేది క్లియర్ కట్ గా అర్థమవుతుది.