Ponnavolu Sudhakar Reddy : జగన్ ప్రభుత్వానిది చాలా పెద్ద హృదయం, చంద్రబాబుకి ఎంతో సాయం చేసింది- సీఐడీ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి
చంద్రబాబు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎంతో గొప్ప మనసుతో వ్యవహరించి చాలా సాయం చేసింది. ఈ ప్రభుత్వం చాలా మానవతా దృక్పథంతో ఉన్న ప్రభుత్వం. Ponnavolu Sudhakar Reddy

Ponnavolu Sudhakar Reddy
Ponnavolu Sudhakar Reddy – Chandrababu Arrest : ఏపీ ప్రభుత్వానిది చాలా పెద్ద హృదయం అని అన్నారు సీఐడీ లాయర్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మానవతా దృక్పథంతో ఉన్న ప్రభుత్వం అని, చంద్రబాబుకి ఎంతో సాయం చేసిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ వ్యవహారంపై పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కేసు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వం హయాంలో రూ.371 కోట్ల రాష్ట్ర ఖజానా దోపిడీకి గురైందన్నారు. ఫేక్ రికార్డులు, ఇన్వాయిస్ లు సృష్టించి ప్రజాధనాన్ని తమ జేబుల్లోకి వేసుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వ పెద్దలే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కు పాల్పడ్డారని స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబుకి కోర్టు రిమాండ్ విధించిందన్నారు. నిధులు విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రటరీలపై అప్పటి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందన్నారు. నిధులు ఇవ్వాల్సిందే అని అప్పటి ముఖ్యమంత్రి హుకుం జారీ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మేము నిధులు రిలీజ్ చేస్తున్నాం అని నోటిఫైలో అధికారులు రాశారని ఆయన వెల్లడించారు.
ఇక చంద్రబాబు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎంతో గొప్ప మనసుతో వ్యవహరించి చాలా సాయం చేసిందన్నారు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. జగన్ ప్రభుత్వానిది చాలా పెద్ద హృదయం అని చెప్పారాయన. మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు. చంద్రబాబుకి మందులు, ఇంటి నుంచి ఆహారం తెప్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం తెలపలేదని లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
”ఇంటి నుంచి వచ్చిన ఆహారం, మందులు తీసుకోవడానికి అనుమతించాలని చంద్రబాబు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. కచ్చితంగా మానవతావాదమే అది. వారికి నిజంగా మందులు చేరాల్సిన అవసరం ఉంది. ఇంటి నుంచి వచ్చిన వంటకాలు తినాల్సిన అవసరం కూడా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం చాలా ఫేర్ గా, పెద్ద హృదయంతో మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని చెప్పింది. కోర్టు వారు నిర్ణయించుకుని ఆర్డర్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇంటి నుంచి భోజనం, మందులు తీసుకోవచ్చని కోర్టు అనుమతి తెలిపింది.
ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకి చాలా పెద్ద సెక్యూరిటీ ఇచ్చారు. చంద్రబాబుకి ఇంట్లోకన్నా జైల్లోనే ఎక్కువ భత్రత ఉంటుంది. ఏకంగా వార్డు వార్డునే శానిటైజ్ చేసి ఇచ్చారు. వసతి ఏర్పాటు చేశారు. చంద్రబాబుకి సంబంధించి ప్రతి విషయంలో ప్రభుత్వం కేర్ తీసుకుంది. ఫుల్ సెక్యూరిటీ ఇచ్చింది. చంద్రబాబు పర్మిషన్ లేనిదే ఆయన బ్లాక్ కి కూడా ఎవరూ పోవడానికి వీల్లేదు. 24/7 సీసీ కెమెరాల్లో మానిటర్ చేసే విధంగా ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు.
ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే క్షణాల్లో డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు. ఈ ప్రభుత్వం చాలా మానవతా కోణంలో చాలా విశాలమైన దృక్పథంతో చంద్రబాబుకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాల్సిన అన్ని పనులు కచ్చితంగా చేసింది. చంద్రబాబుకి జైల్లో ఎలాంటి ఇబ్బందీ లేదు. ఈ ప్రభుత్వం చాలా మానవతా దృక్పథంతో ఉన్న ప్రభుత్వం. అందుకని అన్నీ చేసింది” అని లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు.