కాకినాడ జిల్లా తునిలో మనవరాలి వయసున్న ఓ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు తాటిక నారాయణరావు (62) ఆత్మహత్య చేసుకున్నాడు. బాలికపై అత్యాచారం ఘటన కేసులో అతడిని అరెస్టు చేసిన పోలీసులు గత అర్ధరాత్రి కోర్టుకు తరలిస్తున్న సమయంలో నారాయణరావు బహిర్భూమికి వెళ్తానని చెప్పాడు.
దీంతో తుని పట్టణ శివారులోని కోమటిచెరువు పక్కన పోలీసులు వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో నారాయణరావు చెరువులో దూకాడని పోలీసులు చెప్పారు. చెరువులో గల్లంతైన నారాయణరావు ఆచూకీ కోసం పోలీసులు గజ ఈతగాళ్ల సాయం తీసుకున్నారు. ఇవాళ ఉదయం నారాయణరావు మృతదేహం లభ్యమైంది.
Also Read: ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. ఎందుకంటే?
బాలికను పాఠశాల నుంచి తీసుకువెళ్లిన నారాయణరావు ఆమెకు స్నాక్స్ కొనిపెట్టాడు. ఆమెకు తాను తాతనని పాఠశాల సిబ్బందికి చెప్పాడు. బాలిక ఆరోగ్యం బాగాలేదని తాను తీసుకెళ్లి వైద్యుడికి చూపిస్తానని అన్నాడు. నేరుగా ఓ తోట వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చి నారాయణరావుపై దాడి చేశారు. కాగా, నారాయణరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, బాలికపై అత్యాచార ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత నిన్న అధికారులతో మాట్లాడారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారని అనిత తెలిపారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే వాడెవరైనా ఉక్కుపాదంతో అణచివేస్తామని అన్నారు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడితే కూటమి సర్కార్ చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇస్తున్నామని అనిత చెప్పారు.