AP Weather : ఏపీ వైపు దూసుకొస్తున్న మరో వాయుగుండం.. వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్.. ఈ జిల్లాలకు అలర్ట్..
AP Weather : ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం చూపనుందని, ఈ కారణంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది.
AP Weather
AP Weather : ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం చూపనుందని, ఈ కారణంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. ఎల్నినో భయాలు, వర్షాలు తగ్గుముఖం పట్టడం, ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రైతులు సాగుచేసిన పంటలకు నీరందని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు వర్షాలపై చల్లటి వార్త చెప్పింది.
Also Read : AP Government : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హాస్టల్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర అండమాన్ సముద్రంలో అక్టోబర్ 12న ఉపరితల ఆవర్తనం ఏర్పడి, క్రమంగా బలపడే సూచనలు ఉన్నాయి. అక్టోబర్ 13వ తేదీ నాటికి అది అండమాన్ సముద్రంలో అల్పపీడనంగా మారనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అనంతరం అక్టోబర్ 15వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పింది. ఆ తరువాత అది తుఫాన్ మారి ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
వాయుగుండం దక్షిణ, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్నప్పటికీ.. దీనిపై రానున్న రోజుల్లోనే మరింత స్పష్టత వస్తుందని తెలిపింది. అయితే, ప్రస్తుతం వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఊరటనిచ్చే మరో అంశం ఏమిటంటే.. రానున్న రెండు, మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వానలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
అక్టోబర్ 12వ తేదిన ఉత్తర అండమాన్ సముద్రంపై ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్ 13 నాటికి అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.#AndhraPradesh #APSDMA #DisasterPreparedness #WeatherUpdatee #lowpressure pic.twitter.com/oXEiEI5o8j
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 2, 2026
ఉత్తర మయన్మార్, ఆగ్నేయ బంగ్లాదేశ్, ఈశాన్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలపై గురువారం ఏర్పడిన అల్పపీడన పరిస్థితులు శుక్రవారం కొనసాగగా సాయంత్రానికి బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శనివారం అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా పెరుగుతోంది. శుక్రవారం కడప, తిరుపతి జిల్లాల్లో 38డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ఎన్టీఆర్, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడ్డాయి. మరోవైపు రానున్న రెండు, మూడు రోజుల్లో ఉత్తర, మధ్య భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్ర్కమించనున్నాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈసారి నైరుతి రుతుపవనాలు నిరాశను మిగిల్చాయి. జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సీజన్లో కురవాల్సిన వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో పంటల సాగులో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సీజన్ లో ఏపీ వ్యాప్తంగా సాధారణంగా 589.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 383.6 మిల్లీమీటర్లు వర్షపాతమే నమోదైంది. అంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏకంగా 34.9శాతం లోటు వర్షపాతం నమోదైంది.
