Rain Alert : ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ.. ఈదురు గాలులు, పిడుగుల హెచ్చరికలు..
Rain Alert : ఏపీలో ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలకుతోడు భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Weather Updates
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
- ఈదురుగాలులతోపాటు పిడుగులు పడేచాన్స్
Rain Alert : ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీగా ఈదురుగాలులు, ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఎండల తీవ్రత కూడా కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వర్షానికితోడు ఈదురుగాలులు బీభత్సం కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఉమ్మడి ప్రకాశం, కడప జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. ఉమ్మడి కృష్ణా , గుంటూరు జిల్లాల్లోనూ వర్షం కుురుస్తోంది. విజయవాడ, జగ్గయ్యపేట, మైలవరం, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. విజయవాడలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సింగ్ నగర్, వాంబే కాలనీ, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే, విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ద్రోణి ప్రభావంతో ఇవాళ పల్నాడు, నెల్లూరు, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో.. మొత్తంగా ఇవాళ రాత్రికి రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నంద్యాల జిల్లాలనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాష్ట్రంలో వర్షాలు పడే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల ప్రాంతాల్లో, పెద్దపెద్ద హోర్దింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు.
మరోవైపు ఎండల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ రాష్ట్రంలోని విజయనగరం, మన్యం, అల్లూరి సీతారాము, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 45 నుంచి 46డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 43 నుంచి 44డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది.
