Botsa Satyanarayana: అక్కడున్నది బొత్స మరీ.. ఉమ్మడి విజయనగరం జిల్లా జోలికిపోని జగన్‌

ఓ విధంగా చెప్పాలంటే విజయనగరంలో వైసీపీ అంటే బొత్స ఫ్యామిలీయే... మిగిలిన నియోజకవర్గాల్లో ప్రస్తుత సిట్టింగులంతా బొత్సకు అత్యంత సన్నిహితులే.

Botsa Satyanarayana

సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మార్పులు, చేర్పుల్లో భాగంగా ఐదు జాబితాలు విడుదల చేసింది వైసీపీ… సీఎం జగన్‌ సొంత జిల్లా కడప సహా రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ భారీ మార్పులు చేసింది.. కానీ ఒక్కజిల్లాలో ఎలాంటి మార్పు చేయలేకపోయింది.. అంటే అక్కడంతా బాగుందని భావిస్తోందా? లేక అక్కడి ఎమ్మెల్యేలను కదపలేని స్థితిలో ఉందా?

గతంలో ఏ పార్టీ చేయనన్ని మార్పులు చేస్తూ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తోంది అధికార వైసీపీ.. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ అభ్యర్థుల మార్పు, చేర్పులను చేపట్టింది. సిట్టింగ్‌లను మార్చి, కొత్త వారికి అవకాశాలు ఇస్తోంది. ఇప్పటికే ఐదు జాబితాలను ప్రకటించింది. అన్ని జిల్లాల్లో ఈ మార్పులు, చేర్పులు చేసిన వైసీపీ అధిష్టానం… ఉత్తరాంధ్రలో కీలకమైన ఉమ్మడి విజయనగరం జిల్లాను మాత్రం ఇంతవరకు టచ్ చేయలేకపోయింది. దీనికి కారణం రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణే అంటున్నారు పరిశీలకులు.

మంత్రి బొత్సకు జిల్లాపై పూర్తి పట్టు ఉంది. జిల్లాలో ఎలాంటి మార్పు చేయాలన్నా బొత్సను సంప్రదించాల్సిందే. ఎందుకంటే జిల్లాలో ఆయన కుటుంబమే రాజ్యమేలుతోంది. తొమ్మిది నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి జిల్లాలో ఏకంగా మూడు చోట్ల బొత్స కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

ఇక విజయనగరం జడ్పీ చైర్మన్‌ పదవీలోనూ బొత్స మేనల్లుడు చిన్నశ్రీనునే ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే విజయనగరంలో వైసీపీ అంటే బొత్స ఫ్యామిలీయే… మిగిలిన నియోజకవర్గాల్లో ప్రస్తుత సిట్టింగులంతా బొత్సకు అత్యంత సన్నిహితులే. ఎస్.కోట, పార్వతీపురం సిట్టింగ్ ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు బొత్స ఆశీస్సులతో రాజకీయాలు చేస్తున్నవారే.

ఆయన అవును అంటే అవును… కాదంటే కాదన్నదే లెక్క. ఎవరిని ఎక్కడ నుంచి బరిలోకి దింపాలన్నా… బొత్స మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సిందే.. ఇప్పుడు కాదు 2004 ఎన్నికల నుంచి ఇప్పటివరకు బొత్సకు ఎదురేలేదన్నట్లు మారిపోయింది పరిస్థితి.

బొత్సే తమను గెలిపిస్తారని ఆశ
బొత్స అశీస్సులు ఎప్పుడూ తమపై ఉండాలన్న తాపత్రయం, భయంతోనే నేతలంతా పని చేస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో కూడా బొత్సే తమను గెలిపిస్తారని ఆశపెట్టుకుంటున్నారు. అందుకే రాష్ట్రంలో అన్నిజిల్లాల ఎమ్మెల్యేల్లోనూ టెన్షన్‌ ఉన్నా.. ఈ జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు.

ఇలా బొత్స మార్కు పాలన సాగుతున్న జిల్లాలో.. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత లేదా అంటే… సరైన సమాధానం లభించడం లేదు. మంత్రి బొత్సతో మిగిలినవారు సఖ్యతగా ఉన్నారా అన్నది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే, నెల్లిమర్ల ఎమ్మెల్యే, బొత్స బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు… గత కొంతకాలంగా బొత్స కుటుంబంతో దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. పంచాయితీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బడ్డుకొండ మంత్రి బొత్సనే టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు.

ఆ ఎన్నికల్లో బొత్స మరో సోదరుడు లక్ష్మణరావు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, ఈ విషయంలో మంత్రి బొత్స పట్టించుకోలేదని బాహాటంగానే తన అసంతృప్తి వెల్లగక్కారు బడ్డుకొండ అప్పలనాయుడు. అంతేకాదు మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోసం విశ్వప్రయత్నం చేశారు ఎమ్మెల్యే బడ్డుకొండ. ఇటువంటి వ్యవహారాలతో మంత్రి బొత్స, ఎమ్మెల్యే బడ్డుకొండకు మధ్య కొంత గ్యాప్ నడుస్తోందన్న చర్చ సాగుతోంది.

ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో మంత్రి బొత్స ఆశీస్సులు బడ్డుకొండపై ఉంటాయా? లేదా? అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. అదేవిధంగా బొత్స మేనల్లుడు చిన్న శ్రీను విషయంలోనూ ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న చిన్న శ్రీను… వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయనకు ఏ స్థానం కేటాయించాలన్నదానిపై పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది.

చిన్న శ్రీనుకు?
చిన్న శ్రీనుకు సీఎం జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నా… మంత్రి బొత్సను కాదని చిన్నశ్రీనుకు అసెంబ్లీ సీటు ఇవ్వలేకపోతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో చిన్నశ్రీనును విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపుతారని విస్తృత ప్రచారం జరిగింది. నాలుగు, ఐదు విడత జాబితా విడుదల సమయంలో ఈ విధమైన ప్రచారం జరిగినా… జాబితాలో చిన్నశ్రీను పేరు కనిపించలేదు.

దీంతో అసలు చిన్నశ్రీనును ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు ఇస్తారా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నశ్రీనును కాదంటే విజయనగరం ఎంపీ సీటు మారే అవకాశం కనిపించడంలేదు. ఇక ప్రస్తుత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ కూడా మంత్రి బొత్స శిష్యుడే.. మార్పు ప్రచారం జరుగుతున్నా.. ఆయన ఎక్కడా పెదవి విప్పలేదు. మొత్తం విజయనగరం తాజా రాజకీయాన్ని పరిశీలిస్తే.. బొత్స ప్రమేయం లేకుండా ఏ మార్పు జరిగే అవకాశం కనిపించడం లేదు.

 టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే? వైసీపీ సిట్టింగ్‌ ఎంపీలకూ టికెట్లు..!