పవన్ కల్యాణ్‌, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన ఏపీ మంత్రి జోగి రమేశ్

భీమవరం, గాజువాకలో గ్లాస్ పగిలిపోతే పవన్ పిఠాపురం పారిపోయాడు. చంద్రబాబును చంద్రగిరిలో ఓడిస్తే కుప్పం పారిపోయాడు. 

పవన్ కల్యాణ్‌, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన ఏపీ మంత్రి జోగి రమేశ్

Minister Jogi Ramesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి జోగి రమేశ్ కౌంటర్ ఇచ్చారు. గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంగవీటి మోహన రంగా పేరు ఉచ్ఛరించే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదని అన్నారు. రంగాను దారుణంగా హత్య చేయించింది తెలుగు పార్టీ అని, చంద్రబాబును పక్కనపెట్టుకుని రంగా పేరు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రంగాకు తామే నిజమైన వారసులమని చెప్పుకొచ్చారు. రంగాను చంపిన తెలుగు దేశం పార్టీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దని పవన్‌కు హితవు
పలికారు.

తాను పెడన నుంచి పారిపోయి పెనమలూరులో పోటీ చేస్తున్నానని పవన్, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జోగి రమేశ్ దీటుగా స్పందించారు. ”భీమవరం, గాజువాకలో గ్లాస్ పగిలిపోతే పవన్ పిఠాపురం పారిపోయాడు. చంద్రబాబును చంద్రగిరిలో ఓడిస్తే కుప్పం పారిపోయాడు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఇద్దరూ హైదరాబాద్ పారిపోతారు. ప్రతీ ఎలెక్షన్‌కి నియోజకవర్గాలు, పార్టీలు మార్చడం ఇద్దరికీ అలవాటే. జూన్ 4 తరువాత టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం.

పవన్ కళ్యాణ్‌ది నా స్థాయి కాదు. నేను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని అయ్యాను. పవన్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేదు. పవన్ కి దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి. కృష్ణా జిల్లాలో జోగి రమేశ్ ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలవగలడు. నేను పెనమలూరు వెళ్ళిందే చంద్రబాబు అక్కడికి వస్తాడు అని. నాపై పోటీ పెట్టడానికి చంద్రబాబు ఐదుగురిపై సర్వే చేశాడు. పవన్, చంద్రబాబుకు దమ్ముంటే నాపై పోటీ చేయాల”ని జోగి రమేశ్ కౌంటర్ ఇచ్చారు.

Also Read: వైసీపీ కంచుకోటలో హైవోల్టేజ్ ఫైట్.. ఈసారి అందలమెవరికో?

పవన్, చంద్రబాబు సంస్కార హీనులు
సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడిని అవహేళన చేస్తున్న పవన్, చంద్రబాబు సంస్కార హీనులని విమర్శించారు. విలువలు లేని రాజకీయాలు చేస్తూ, విషషర్పాల్లా బస్సు యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పవన్, చంద్రబాబు సభలకు జనం రావడం లేదని, జగన్ బస్సు యాత్రకు భారీగా వస్తున్నారని అన్నారు.