సొంత ఖర్చులతో బట్టలు పెట్టి మరీ.. పేదలకు ఇంటి పట్టాలు అందజేసిన మంత్రి నారా లోకేశ్

మంత్రి నారా లోకేశ్ తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ‘మన ఇల్లు - మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు.

Minister Nara lokesh

Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ‘మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. సొంత ఖర్చులతో బట్టలు పెట్టి మరీ లబ్ధిదారులకు లోకేశ్ ఇంటి పట్టాలను అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: అనిల్‌ కుమార్ యాదవ్ ఎక్కడ? క్యాడర్‌కి కటీఫ్‌ చెప్పేశారా?

మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్నా. సూపర్ సిక్స్ హామీలతోపాటు మంగళగిరికి నేను ప్రత్యేకంగా ఇచ్చిన ఒక్కోహామీని నెరవేర్చే పనిలో ఉన్నానని లోకేశ్ తెలిపారు. ఏప్రిల్ 13న మంగళగిరిలో 100 పడకల ఆస్పత్రికి భూమిపూజ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 13 నాటికి ప్రారంభోత్సవం చేస్తామని చెప్పారు. కుప్పంతో పాటు మంగళగిరిని కూడా తెలుగుదేశం కంచుకోటగా మారుస్తానని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుకు హామీ ఇచ్చానని, ఆ హామీని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

Also Read: ఆ ఇద్దరి భేటీ వెనుక రీజన్ అదేనా? ఆయనకు కీలక పదవి ఖాయమా? సీఎం నుంచి హామీ వచ్చేసిందా?

మంగళగిరి పేదలకు ఇంటి పట్టాల పంపిణీ రెండున్నర దశాబ్దాల కల. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లో ఇంటి పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టామని లోకేశ్ అన్నారు. తమకు ఎవరి ద్వారా లబ్ధి చేకూరిందో ప్రజలు గుండెల మీద చేయివేసి ఆలోచించుకోవాలని, ఓడిన చోటే గెలిచి చూపాలని మంగళగిరిపై ప్రత్యేక దృష్టి సారించి 26 సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉండగా అమలు చేశానని లోకేశ్ చెప్పారు.

యర్రబాలెం గ్రామానికి చెందిన 248 మందికి శాశ్వత ఇంటి పట్టాలను లోకేశ్ పంపిణీ చేశారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి నీరుకొండ గ్రామానికి చెందిన 99 మందికి, రత్నాల చెరువుకు చెందిన 199 మందికి మొత్తం 546 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను లోకేశ్ అందించనున్నారు.