ఆ ఇద్దరి భేటీ వెనుక రీజన్ అదేనా? ఆయనకు కీలక పదవి ఖాయమా? సీఎం నుంచి హామీ వచ్చేసిందా?

ఎమ్మెల్సీల ఖరారులో ఒకే వర్గానికి చెందిన వారికి బీజేపీ, జనసేన నుంచి అవకాశం ఇచ్చిన అంశం ప్రస్తావనకు వచ్చింది.

ఆ ఇద్దరి భేటీ వెనుక రీజన్ అదేనా? ఆయనకు కీలక పదవి ఖాయమా? సీఎం నుంచి హామీ వచ్చేసిందా?

Updated On : April 3, 2025 / 9:40 PM IST

ఏపీలో కాపు సామాజిక వర్గానికి కూటమి పెద్దపీట వేస్తుందా..? ఇప్పటికే సోము వీర్రాజు, నాగబాబుకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన కూటమి ఇప్పుడు మరో కాపు నేత వంగవీటి రాధాకు సైతం పదవి ఖాయం చేసిందా.. ముఖ్యమంత్రి నుంచి హామీ వచ్చేసినట్టేనా? సీఎం చంద్రబాబుతో రాధా భేటీ తర్వాత ఇప్పుడిదే వార్త పొలిటికల్ సర్కిళ్లలో మెయిన్ డిబెట్‌ పాయింట్‌గా టర్న్‌ తీసుకుంది. మరి ఇందులో నిజమెంతా..?

కూటమి.. కాపులకు పెద్దపీట వేస్తుందంటూ ఏపీ పొలిటికల్‌ సర్కిళ్లలో ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. బీజేపీ నుంచి సోము వీర్రాజుకు, జనసేన నుంచి కొణిదెల నాగబాబుకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. ఇప్పుడు టీడీపీ నుంచి కాపు సామాజిక నేత వంగవీటి రాధాకు కూడా పదవి ఖాయమనే టాక్ ఏపీలో బిగ్ సౌండ్ చేస్తోంది.

నిజానికి 2024 ఎన్నికల సమయంలో కూటమిలోని మూడు పార్టీల్లో పలువురికి పదవులిస్తామంటూ హామీలు గుప్పించారు. ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తామని భరోసా ఇచ్చారు. ఐతే చాలా మందికి ఇంకా అవకాశం దక్కలేదనేది వాస్తవం. 2019లోనూ వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి పక్కా అని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ఇన్నాళ్ల బ్రేక్ తర్వాత చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో వంగవీటి రాధా వర్గం ఆనందం వ్యక్తం చేస్తోందట. పదవి పక్కా అంటూ ఊహగానాలు ఊపందుకున్నాయి.

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. తర్వాత ప్రజారాజ్యం.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల సమయంలో రాధా విజయవాడ సెంట్రల్ సీటు ఆశించారు. అందుకు నిరాకరించిన జగన్.. మచిలీపట్నం ఎంపీ సీటు ఇస్తానన్నారు. దీంతో వంగవీటి రాధా సైలెంట్‌గా వెళ్లి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలోనే వంగవీటికి ఎమ్మెల్సీ పదవి అంటూ హామీ దక్కింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో రాధా మౌనంగా ఉండిపోయారు.

ఇలా జరగలేదు.. 
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ తిరిగి వంగవీటి రాధాను వైసీపీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, సఫలం కాలేదు. 2024 ఎన్నికల సమయంలో రాధా జనసేనలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. పవన్, నాదెండ్ల మనోహర్‌తోనూ రాధా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కూటమి ఖరారు కాగానే.. టీడీపీకి మద్దతుగా రాధా ప్రచారం చేశారు. 2024 లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలోనే రాధాకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని అందరు భావించారట. కానీ అలా జరగలేదు.

ఈ సమయంలోనే రాజకీయాల నుంచి రాధా తప్పుకుంటున్నారనే ప్రచారం సైతం పొలిటికల్ సర్కిల్స్‌లో ఊపందుకుంది. దీంతో, టీడీపీ నాయకత్వం అలర్ట్ అయింది. వంగవీటి రాధాను సీఎం చంద్రబాబు పిలిచి 20నిమిషాల పాటు మాట్లాడారు. ఇక భేటీ జరిగినప్పటి నుంచి రాధాకు పదవి ఖాయమనే టాక్ పొలిటికల్‌ సర్కిళ్లలో బిగ్ సౌండ్ చేస్తోంది.

అయితే ఎమ్మెల్సీల ఖరారులో ఒకే వర్గానికి చెందిన వారికి బీజేపీ, జనసేన నుంచి అవకాశం ఇచ్చిన అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇప్పుడు రాధాకు ఎమ్మెల్సీ కట్టబెడితే.. ముగ్గురు కాపు సామాజిక వర్గ నేతలకు పదవులు ఇచ్చినట్లు అవుతుందని గాసిప్స్ సౌండ్ చేస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని తన మద్ధతుదారల దగ్గర రాధా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా.. లేదా నామినేటెడ్ పదవి కట్టబెడతారా అనే అంశం ఆసక్తికరంగా మారింది.