Nara Lokesh : గత ప్రభుత్వం సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు చాలా కష్టపడాల్సి వస్తోందన్నారు మంత్రి నారా లోకేశ్. ఏపీలో పెట్టుబుడులు పెట్టాలని కోరుతుంటే.. జగన్ ఇకపై రారుగా అని అందరూ అడుగుతున్నారని ఆయన చెప్పారు. జగన్ భవిష్యత్తులో అధికారంలోకి రారు అనే గ్యారంటీ ఇస్తే పెట్టుబడులు పెడతామంటున్నారు అని లోకేశ్ వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంత్రి నారా లోకేశ్ మండలిలో మాట్లాడారు.
8 నెలల్లోనే అనేక సంస్థలను రాష్ట్రానికి తీసుకువచ్చాం. 16,347 పోస్టులతో డీఎస్సీ వేస్తామని చెప్పాం. టెట్ కూడా నిర్వహించాం. కొన్ని సాంకేతిక కారణాలతో డీఎస్సీ ప్రకటన వేయలేకపోయాం. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే డీఎస్సీని నిర్వహిస్తామని హామీ ఇస్తున్నాం. ఈ విద్యా సంవత్సరంలోనే డీఎస్సీనియామకాలు పూర్తి చేసి టీచర్లను నియమిస్తాం.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తాం..
ఏప్రిల్, మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తాం. కౌన్సిల్ సాక్షిగా చెబుతున్నా.. ఇచ్చిన హామీలు అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజలకు వ్యతిరేకంగా ఉండే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, చెత్త పన్ను రద్దు చేశాం. జీవో 117 రద్దు చేస్తానని పాదయాత్రలో నేను హామీ ఇచ్చా. అమలు చేస్తాం.
ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోము. అందరికీ లబ్ది చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టింది తెలుగు దేశం ప్రభుత్వమే. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంకి మేము వ్యతిరేకం కాదు. గత ఐదేళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. గతంలో 45 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 33 లక్షలకు పడిపోయింది.
సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం పెడతాం. పుస్తకాలు సహా ఎక్కడా మా పేర్లు, ఫొటోలు లేకుండా ఇస్తున్నాం. ఒక్క స్కూల్ నూ మూయకూడదని మేము ప్రయత్నం చేశాం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో త్వరలో లీప్ స్కూళ్లు ప్రారంభిస్తాం. త్వరలో మంగళగిరిలో లీప్ స్కూల్ ను ఏర్పాటు చేసి నాణ్యమైన ప్రమాణాలతో విద్య అందిస్తాం.
వారిలో నా బంధువులు ఒక్కరు కూడా లేరు.. పవన్ అన్న నిధులు ఇచ్చారు..
విద్యా వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతల బంధువులను గత ప్రభుత్వం వీసీలుగా నియమించింది. కూటమి ప్రభుత్వంలో ప్రతిభను ఆధారంగా చేసుకుని వీసీలను నియమించాం. నియమించిన వీసీల్లో ఒక్కరూ నా బంధువులు లేరు.
హామీ ఇచ్చినట్లుగా విదేశీ విద్య తిరిగి ప్రారంభిస్తాం. త్వరలో ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేస్తాం. ఐదేళ్లుగా పంచాయతీలకు నిధులివ్వకపోతే పవన్ అన్న పంచాయతీలకు తిరిగి నిధులు ఇచ్చారు. దారి తప్పిన జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టును పవన్ అన్న తిరిగి దారిలో పెట్టారు.
దుబాయ్ లో ఐసీసీ ఛైర్మన్ ను కలిశా. దేశంలో ఎక్కడా లేని రీతిలో అమరావతిలో అతిపెద్ద స్టేడియం కట్టే విషయమై చర్చించా. 161 సేవలను వాట్సప్ ద్వారా అందిస్తున్నాం. 500 సేవలు పెంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. విజనరీకి ప్రిజనరీకి మధ్య తేడా ప్రజలకు తెలియాలి. అందరూ తెలుసుకోవాలి.
విజన్ 2047 గురించి వైసీపీ ఎగతాళిగా మాట్లాడటం సరైంది కాదు. ఏదైనా సాధించాలంటే కచ్చితంగా ఓ లక్ష్యం పెట్టుకోవాలి. విజన్ 2020లో భాగంగానే శంషాబాద్, మెట్రో రైలు వచ్చాయి. హైదరాబాద్ అభివృద్ది చెందింది. ఎన్ని సమస్యలు ఉన్నా తొలి ఏడాదిలో 12.5 శాతం గ్రోత్ రేట్ చేసి చూపించాం. హైకోర్టు బెంచిని ఎట్టి పరిస్థితుల్లోనూ కర్నూలులో ఏర్పాటు చేస్తాం.
బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ను త్వరలో ఏపీలో ఏర్పాటు చేయబోతున్నాం.
Also Read : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు- సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మొత్తం సభ్యుల్లో కనీసం పది శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని పార్లమెంట్, అసెంబ్లీ రూల్స్ లో ఉన్నాయి. 17 మంది సభ్యులు లేకపోతే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా రాదని గతంలో సీఎం హాదాలో జగన్ సభలో చెప్పారు. సూపర్ సిక్స్ హామీలను తప్పకుండా అమలు చేస్తామని గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. తప్పనిసరిగా అమలు చేస్తాం.
వైసీపీ వారికి పదవుల కోసం తాపత్రయం తప్ప ప్రజా సమస్యలపై పోరాడే తత్వం లేదు. పేదరికం లేని ఏపీని తయారు చేయడమే మా లక్ష్యం. పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునేందుకు మేము సిద్ధం. దొంగ కేసులు పెట్టి వేధించడం మా విధానం కాదు. రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకునేందుకు అందరూ కలిసి రావాలి” అని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.