Pawan Kalyan : చంద్రబాబు గట్స్ కు హ్యాట్సాఫ్.. గవర్నర్ కు సారీ.. అసెంబ్లీలో పవన్ కామెంట్స్..

వైసీపీ సభ్యుల తీరు చూస్తుంటే.. చట్టాల ఉల్లంఘన, డాక్టర్ సుధాకర్ హత్య, వివేకా హత్య, చంద్రబాబు అరెస్ట్ ఘటనలే గుర్తుకు వస్తున్నాయి.

Pawan Kalyan : చంద్రబాబు గట్స్ కు హ్యాట్సాఫ్.. గవర్నర్ కు సారీ.. అసెంబ్లీలో పవన్ కామెంట్స్..

Updated On : February 25, 2025 / 7:52 PM IST

Pawan Kalyan : ఏపీ అసెంబ్లీలో వైసీపీ వ్యవహరించిన తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. గొడవలు, బూతులకు వైసీపీ కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఆయన ధ్వజమెత్తారు. నిన్న సభలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు వివేకా హత్యను గుర్తుకు తెచ్చిందన్నారు పవన్ కల్యాణ్. ప్రజా వేదికను కూల్చిన విధానం గుర్తొచ్చిందన్నారు.

ఐదేళ్లు వైసీపీని తట్టుకుని నిలబడిన చంద్రబాబుకు హ్యాట్సాఫ్ చెప్పారు పవన్ కల్యాణ్. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బాయ్ కాట్ చేయడం బాధాకరమన్నారు పవన్ కల్యాణ్. సభలో వైసీపీ సభ్యుల తీరు పట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు.

Also Read : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు- సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

”వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ విజయవంతంగా తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఎన్డీయే సభ్యులు అసెంబ్లీలో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. మా తప్పు లేకపోయినా వైసీపీ నేతల తీరు పట్ల గవర్నర్ కు మేమంతా క్షమాపణలు చెబుతున్నాం. వైసీపీ సభ్యుల తీరు చూస్తుంటే.. వివేకా హత్య, చట్టాల ఉల్లంఘన, డాక్టర్ సుధాకర్ హత్య, చంద్రబాబు అరెస్ట్ ఘటనలే గుర్తుకు వస్తున్నాయి” అని పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు.

 

”అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుంటే వైసీపీ సభ్యులు వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. గవర్నర్ ప్రసంగాన్ని వాళ్లు బహిష్కరించడం బాధాకరం. ఎమ్మెల్యేలు అందరికీ ఆదర్శంగా ఉండాలి. వైసీపీ నేతలు గొడవలు, బూతులకు పర్యాయ పదాలుగా మారారు. చట్టాలు చేయాల్సిన వాళ్లే నియమాలను ఉల్లంఘిస్తే ఎలా? అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తించిన వాళ్లు బయట ఇంకెలా ఉంటారో?” అని పవన్ కల్యాణ్ అన్నారు.

”సంఖ్యా బలం ఉందా లేదా అనేది పక్కన పెడితే.. ప్రతి సభ్యుడు సభ నియమాలను పాటించాలి. మనమే రూల్స్ ను బ్రేక్ చేస్తే ప్రజలకు ఏం చెబుదాం? గవర్నర్ కనుక సుప్రీంకోర్టు జస్టిస్ గా ఉన్నప్పుడు వైసీపీ సభ్యులు ఇలానే గొడవ చేసే ధైర్యం చేయగలరా? ఆయన కళ్లలోకి చూడగలరా?” అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.