WhatsApp Governance : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు- సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అన్ని కలెక్టరేట్లలో వాట్సప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు చెప్పారు.

WhatsApp Governance : ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. రాష్ట్రంలో వాట్సప్ గవర్నెన్స్, టెక్నాలజీ పౌర సేవలు అందించడంపై అధికారులతో సమీక్ష జరిపారు చంద్రబాబు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
అన్ని కలెక్టరేట్లలో వాట్సప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు చెప్పారు. ఈ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా విస్తృతంగా ప్రచారం చేసి వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రైతు బజార్లలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలన్నారు. నిత్యవసర సరకుల ధరలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులతో చెప్పారు చంద్రబాబు. ఇక, బెల్టు షాపులు ఎక్కడున్నా ఉపేక్షించొద్దని అధికారులతో చెప్పారు సీఎం చంద్రబాబు.
దేశంలోనే ఫస్ట్ టైమ్ ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మంత్రి నారా లోకేశ్ దీన్ని ప్రారంభించారు. ఇందుకోసం వాట్సాప్ నంబర్ 95523 00009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్ ట్యాగ్ ఉంది. పౌరసేవలు అందివ్వడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చింది ప్రభుత్వం.
Also Read : ఆ భయంతోనే అసెంబ్లీకి వెళ్లారా? సభకు వెళ్లే దమ్ము లేకపోతే రాజీనామా చేయండి- జగన్ పై షర్మిల ఫైర్
సర్టిఫికెట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికేందుకు దీన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని పౌరులకు చేరవేయాలంటే ఈ వాట్సప్ అకౌంట్ ద్వారా మేసేజ్ లు పంపిస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది. అలాగే వరదలు, వర్షాలు, విద్యుత్ సబ్‌స్టేషన్ల మరమ్మతులు, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి అందిస్తారు.
తొలి దశలో 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది. రెండో దశలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్‌ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలయ్యాయి.