Balakrishna : నేను అండగా ఉంటా, ఇళ్లు కట్టిస్తా.. హిందూపురంలో వరద బాధితులకు ఎమ్మెల్యే బాలకృష్ణ భరోసా

హిందూపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరిశీలించారు. వరద ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులను పరామర్శించారు. తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.

Balakrishna : నేను అండగా ఉంటా, ఇళ్లు కట్టిస్తా.. హిందూపురంలో వరద బాధితులకు ఎమ్మెల్యే బాలకృష్ణ భరోసా

Updated On : October 16, 2022 / 7:18 PM IST

Balakrishna : సత్యసాయి జిల్లాలోని హిందూపురాన్ని భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హిందూపురం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

నాలుగు రోజులుగా వరద నీటిలోనే హిందూపురం ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. హిందూపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరిశీలించారు. వరద ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులను పరామర్శించారు. నీట మునిగిన చౌడేశ్వరి కాలనీ, ఆర్టీసీ
కాలనీల్లో పర్యటించి బాధితుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న కొట్నూరు చెరువును పరిశీలించారు బాలకృష్ణ. వరద బాధితులకు అండగా ఉంటానని బాలకృష్ణ హామీ ఇచ్చారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మూడు రోజులైనా తాగడానికి నీరు కూడా లేదని, చిన్నపిల్లలకు పాలు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాలకృష్ణతో కన్నీరుమున్నీరయ్యారు వరద బాధితులు. వారందరికీ తాను ఉన్నానని భరోసా కల్పించారు బాలకృష్ణ. వర్షానికి నేల కూలిన ఇళ్లను పరిశీలించిన బాలకృష్ణ, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు బాలకృష్ణ. రేపటి నుంచి టీడీపీ కార్యకర్తలు నిత్యవసర వస్తువులు అందజేస్తారని భరోసా ఇచ్చారు.

హిందూపురంలో పర్యటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ వరద బాధితులను పరామర్శించారు. జగన్ ప్రభుత్వంపై ఆయన ఫైర్ అయ్యారు. ”వరద బాధితులను అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. పంచాయతీ నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. ప్రజాప్రతినిధులు ఎలాగూ అభివృద్ధి చేయరు. సర్పంచ్ లకూ అభివృద్ధి చేసే అవకాశం లేకుండా పోయింది. సర్పంచ్ లు ఆందోళనకు దిగితే మద్దతు తెలియజేస్తా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులు, హత్యా రాజకీయాలు చేస్తున్నారు. గతంలో దోమలపై దండయాత్ర చేపడితే ఎద్దేవా చేశారు. ఇప్పుడు దోమల వల్ల విషజ్వరాలతో 2వేల మంది చనిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడిసిన్స్ అందుబాటులో ఉంచాలి. వరద నష్టంపై అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సమస్యలను వైసీపీ పరిష్కరించకపోతే మేము అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం” అని బాలకృష్ణ హామీ ఇచ్చారు.